రైతులకు కుచ్చుటోపీ..! | - | Sakshi
Sakshi News home page

రైతులకు కుచ్చుటోపీ..!

Aug 4 2026 12:35 AM | Updated on Aug 4 2026 12:35 AM

పెబ్బేరు కేంద్రంగా ఓ వ్యాపారి మామిడి కొనుగోలు

నెలల తరబడి డబ్బులు

చెల్లించకుండా కాలయాపన

మోసపోయామని గుర్తించి ఎస్పీని ఆశ్రయించిన బాధిత రైతులు

తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకోలు

బుక్కచిట్టీ రాసిచ్చాడు..

రూ. 55వేల విలువైన మామిడి కాయలు విక్రయించగా.. బుక్క చిట్టీపై రాసిచ్చాడు. ఆ తర్వాత డబ్బుల కోసం మూడు నెలలుగా తిప్పించుకుంటున్నాడు. వీపనగండ్ల మండలంతో పాటు పాన్‌గల్‌, పెబ్బేరు మండల్లాలోని రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. రోజుకో తేదీ చెబుతూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రైతులకు రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంది.

– వెంకట్‌రెడ్డి, మామిడి రైతు, వీపనగండ్ల

నిర్లక్ష్యంగా సమాధానం..

మూడు నెలల క్రితం మామిడి కాయలు విక్రయించాను. నాకు రూ. 66వేలు రావాలి. హైదరాబాద్‌లోని మార్కెట్‌కు వెళ్లి విక్రయించేందుకు ఖర్చు, శ్రమ పడాల్సి వస్తుందని పెబ్బేరులోనే విక్రయించాను. సదరు వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బుల కోసం గట్టిగా ప్రశ్నిస్తే.. నేను నష్టపోయా.. ఇవ్వలేను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు.

– నారాయణ, మామిడి రైతు, వీపనగండ్ల

త్వరలోనే చెల్లిస్తా..

రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి ఢిల్లీ, పంజాబ్‌ ప్రాంతాలకు ఎగుమతి చేశా. అక్కడి వ్యాపారులు మోసం చేశారు. చివరగా తీసుకెళ్లిన లోడ్‌లకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్‌లో యాపిల్స్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. అందులో నుంచి రైతులకు డబ్బులు చెల్లిస్తాను. అందరు వ్యాపారుల మాదిరిగానే బుక్క చిట్టీలపై లావాదేవీలు చేశాను. కొందరు రైతులు ఒత్తిడి తీసుకొస్తే.. చెక్కులు ఇచ్చాను. – సోమశేఖర్‌, వ్యాపారి

వనపర్తి: మూడు నెలల క్రితం రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసిన ఓ వ్యాపారి.. చెల్లింపుల సమయం వచ్చేసరికి మొఖం చాటేశాడు. చివరకు తాము మోసపోయిన గుర్తించిన బాధిత రైతులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ సునీతారెడ్డిని ఆశ్రయించి.. తమకు న్యాయం చేయాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి పెబ్బేరు కేంద్రంగా ఓ రైస్‌మిల్లు గోదాంలో పండ్లు నిల్వచేస్తున్నాడు. అయితే ఈ ప్రాంతంలో పండిన మామిడి కాయలను సరైన ధరకు కొనుగోలు చేస్తానంటూ.. రైతులను నమ్మబలికాడు. ఒకటి, రెండుసార్లు కాపు వచ్చిన తొలినాళ్లలో కొంత మొత్తంలో కొని చెప్పినట్టుగానే సకాలంలో డబ్బులు చెల్లించాడు. దీంతో వీపనగండ్ల, పెబ్బేరు, పాన్‌గల్‌ మండలాలకు చెందిన సుమారు 150 మంది రైతులు మామిడి ఉత్పత్తులను సదరు వ్యాపారికి విక్రయించారు. అయితే మామిడి కొనుగోలుకు సంబంధించి డబ్బుల లెక్కను బుక్కచిట్టీలపై రాసిచ్చిన సదరు వ్యాపారి.. నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అప్పుడూ.. ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తున్నాడంటూ సోమవారం పోలీసు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

45రోజుల పాటు కొనుగోలు..

పెబ్బేరు శివారు ప్రాంతంలోని పాడుపడిన రైస్‌మిల్లులో రైతుల నుంచి మామిడి కాయల కొనుగోలు ప్రక్రియ నిర్వహించారు. 45రోజుల పాటు మామిడి కొనుగోళ్లు సాగినప్పటికీ స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కనీసం అనుమతులు తీసుకోవడం.. మార్కెట్‌ ఫీజు ఊసెత్తిన దాఖలాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement