కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొత్తకోటలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో తుర్క కాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ. 54లక్షల వ్యయంతో (ఒక్కో లబ్ధిదారుడికి రూ. 60వేల విలువైన యూనిట్) వందశాతం రాయితీపై జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది లబ్ధిదారులకు రూ. 12కోట్ల వ్యయంతో పనిముట్ల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తుర్క కాషా కమ్యూనిటీ సభ్యులు అత్యంత కష్టమైన వృత్తితో జీవనోపాధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న జనరేటర్లు, టూల్ కిట్లు వారి ఉపాధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. తుర్క కాషా కమ్యూనిటీ కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా పథకాన్ని అమలు చేయడం సంతోషకరమన్నారు. ప్రజా పాలనలో అన్ని వర్గాలు, అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. తుర్క కాషా కమ్యూనిటీ అవసరాల దృష్ట్యా షాదీఖానాల నిర్మాణానికి సహకరించాలని ఆయన మంత్రిని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పల్లవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, తుర్క కాషా కమ్యూనిటీ అధ్యక్షుడు బడే సాబ్, టీజీఎంఎఫ్‌సీ ఏజీఎం ప్రవీణ్ కులకర్ణి, పవర్‌బిల్ట్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్, సీడీసీ చైర్మన్ చంద్రమోహన్‌రెడ్డి, నాయకులు పి.కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎన్‌జే బోయేజ్, బీచుపల్లి యాదవ్, పెంటన్నయాదవ్, సుభాష్ పాల్గొన్నారు.


