వనపర్తి రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు, శ్రీరంగాపురం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ శాఖల వారీగా ప్రగతి నివేదికలపై నిశితంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయా శాఖల అధికారులు సరైన సమాచారం లేకుండా పొంతన లేని సమాధానాలు చెప్పడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సంబంధిత అంశాలపై స్పష్టత ఇవ్వని విద్యుత్ లైన్‌మ్యాన్‌కు నోటీస్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. శ్రీరంగాపురంలో విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోయిన ఎంఈఓ హనుమంతుకు మెమో జారీ చేయాలన్నారు. సమావేశానికి ఇరిగేషన్‌శాఖ అధికారులు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీరంగాపురంలో రూ. 10లక్షలతో నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవనం, రూ.10 లక్షలతో మండల మహిళా సమాఖ్య భవనం, రూ.30 లక్షలతో గోదాం నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పీఎంశ్రీ పాఠశాలలో రూ. 14.50 లక్షలతో ఏర్పాటుచేసిన కంపూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారులు సుధారాణి, యాదయ్య, సింగిల్‌విండో చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, వైస్‌చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు సత్యనారాయణరెడ్డి, వరలక్ష్మి ఉన్నారు.


