పశుసంవర్థకంతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి
పార్వతీపురం రూరల్: పశుసంవర్థక రంగం బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖపై సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశుపాలనలో జెమిని, పెరప్లెక్సిటీ వంటి ఏఐ సాంకేతికతను జోడించి రైతులకు వేగంగా సమాచారం అందించాలని, పాఠశాల విద్యార్థులు, యువతకు ఈ రంగంలోని ఉపాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏడాదికి ప్రతి రైతు 1200 గుడ్ల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ప్రాజెక్టులను ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా డైరీ సంఘాలను బలోపేతం చేస్తూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేయాలని, ఎగుమతి నాణ్యత కలిగిన మేత ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో అమలు చేసిన గ్రామ ముస్తాబు, గోపాల సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పశుసంవర్థక శాఖాధికారి మన్మథరావు వివరించారు. సమావేశంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


