పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ
తెర్లాం: మండలంలోని లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా బస్తాలను వ్యవసాయ సిబ్బంది పంపిణీ చేశారు. మంగళవారం లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ చేయడంతో ఒక్కసారిగా రైతులు అధిక సంఖ్యలో వచ్చి యూరియా కోసం ఎగబడ్డారు. వారిని నియంత్రించడం కష్టమవడంతో వ్యవసాయ సిబ్బంది స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో ఎస్సై సాగర్‌బాబు అక్కడికి సిబ్బందితో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులందరికీ యూరియా ఇస్తారని, అందరూ వరుస క్రమంలో నిలబడాలని సూచించారు. రైతులంతా వరుస క్రమంలో ఉండి యూరియా తీసుకున్నారు. ఎరువుల పంపిణీ పూర్తయినంతవరకు ఎస్సై అక్కడే ఉండి పర్యవేక్షించారు. రైతులకు కావాల్సినంత యూరియా రైతు సేవా కేంద్రంలో నిల్వ ఉందని, యూరియా అవసరంలేని రైతులు కూడా వచ్చి తీసుకువెళ్తుండడంతో సమస్య ఏర్పడుతోందని మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లోని రైతుల ఆధార్‌కార్డు, వన్‌బీ తీసుకుని క్షేత్రస్థాయిలో ఆ రైతు ఏ పంట సాగుచేస్తున్నాడో పరిశీలించిన తరువాత యూరియా పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు.


