రిపబ్లిక్ డే పరేడ్‌కు 8మంది విద్యార్థుల ఎంపిక
బాడంగి: రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన విజవాడలో జరగనున్న సీఎం పరేడ్‌కు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వివిధ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ కేవీ రమణచెప్పారు. ఈ మేరకు స్థానిక అంబేడ్కర్ బాలుర గురుకులంలో జిల్లాతరఫున విద్యార్థులను మంగళవారం ఎంపికచేశామన్నారు. ఉమ్మడి జిల్లాలోని కొప్పెర్ల, బాడంగి, పార్వతీపురం, సాలూరు, పాలకొండ గురుకుల పాఠశాలలనుంచి 15మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 8మందిని ఎంపికచేశామని తెలిపారు. ఎంపికచేసిన విద్యార్థులు వచ్చేనెల 3వ తేదీన ఏలూరు జిల్లా పెదవేమలిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలో పాల్గొననున్నట్లు చెప్పారు.
చెరుకు పంట దగ్ధం
బలిజిపేట: మండలంలోని పి.చాకరాపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న చెరుకు పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మురగడాం గ్రామానికి చెందిన కౌలు రైతు ఎం.వెంకటినాయుడు పంట దగ్ధమైంది. రెవెన్యూ లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో 3.95ఎకరాల విస్తీర్ణంలో పండిన చెరుకుపంట సుమారు 200టన్నులు ఉంటుందని అంచనా. దీనిప్రకారం రైతుకు సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. కౌలు రైతు వెంకటినాయుడు పార్వతీపురానికి చెందిన డి.దాలినాయుడు వద్ద భూమి కౌలుకు తీసుకుని పంట పండిస్తున్నాడని కౌలు రైతుకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం కౌలురైతును ఆదుకోవాలని కోరుతున్నారు.
రెచ్చిపోతున్న బ్యాటరీ దొంగలు
రామభద్రపురం: మండలంలో వాహనాల బ్యాటరీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల రోజూ ఏదో గ్రామంలో వాహనాల బ్యాటరీలు చోరీ జరిగిందంటూ సంబంధిత వాహనచోదకులు లబోదిబోమం టున్నారు. రెండు రోజుల క్రితం బూశాయవలసలో ట్రాక్టర్, ఆటోలకు చెందిన బ్యాటరీలు చోరీచేయగా సోమవారం రాత్రి స్థానిక సాయినగర్‌లోని గుడ్ల కాంట్రాక్టర్ బండారు నాగరాజుకు చెందిన రెండు వ్యాన్లలోని రెండు బ్యాటరీలు దొంగలు చోరీ చేశారు.గతంలో కూడా ఒక వ్యాన్‌లో ఉన్న గుడ్లు చిదిమేసి, వ్యాన్‌కు చెందిన బ్యాటరీని దొంగలు ఎత్తికెళ్లిపోయారని గుడ్ల కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నాగరాజు తెలిపాడు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయని, పోలీసులు నైట్ బీట్ సమయంలో నిఘాపెట్టాలని బాధితులు కోరుతున్నారు.
కౌశల్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల సత్తా
● విజేతలకు డీఈఓ అభినందనలు
నెల్లిమర్ల: కౌశల్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన కౌశల్ రాష్ట్రస్థాయి పోటీలు–2025లో జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. ఈ మేరకు జిల్లా కౌశల్ కో ఆర్డినేటర్ వివరాలు వెల్లడించారు. పోస్టర్ ప్రెజెంటేషన్ విభాగంలో మలిచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎ. సాయి వైష్ణవి ప్రథమ బహుమతి సాధించింది. జరజాపుపేట విద్యార్థి తనుశ్రీ 3వ బహుమతి సాధించింది. అయ్యన్నపేట విద్యార్థి జి.భార్గవి కన్సొలేషన్ బహుమతి పొందింది. అలాగే రీల్స్ పోటీలో శ్రీరామ్‌నగర్ పాఠశాల విద్యార్థి సీహెచ్ సూర్యప్రకాష్ రాష్ట్ర స్థాయి 2వ బహుమతి సాధించాడు. ఈ సందర్భంగా విజేతలను జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు, డిప్యూటీ డీఈఓ కేవీ రమణ అభినందించారు. అలాగే జిల్లా కౌశల్ కోఆర్డినేటర్ ఎస్ బంగారయ్యను, గైడ్ టీచర్లను ప్రశంసించారు.
రిపబ్లిక్ డే పరేడ్‌కు 8మంది విద్యార్థుల ఎంపిక
రిపబ్లిక్ డే పరేడ్‌కు 8మంది విద్యార్థుల ఎంపిక
రిపబ్లిక్ డే పరేడ్‌కు 8మంది విద్యార్థుల ఎంపిక


