మత్య్సకార సొసైటీ ఎన్నికలకు రాజకీయ రంగు
విజయనగరం ఫోర్ట్: చేపల వేట సాగించే మత్య్సకారుల సమస్యలు, హక్కుల కోసం ఏర్పాటైన జిల్లా మత్య్సకార సహకారం సంఘం ఎన్నికలకు కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు. 100 లోపు సభ్యులు ఉన్న సంఘం ఎన్నికకు కోట్లాది రుపాయలు ఖర్చుచేశారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, నామినేటేడ్ పదవుల్లో ఉన్న నేతలు, టీడీపీ నాయకులు మూడు, నాలుగు రోజుల పాటు క్యాంప్ రాజకీయాలు నడిపారు. సభ్యులను క్యాంపులకు తరలించే బాధ్యతను సైతం టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మత్య్సకార సహకార సంఘం ఎన్నికలు జరగాయని పలువురు మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. మత్య్సకార సహకార సంఘం ఎన్నికల్లో ఎప్పుడూ రాజకీయ జోక్యం ఉండేదికాదని చెబుతున్నారు.
ఎన్నికల కేంద్రం వద్ద మంత్రి అనుచరులు
పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న చేప పిల్లల పెంపకం కేంద్రంలో మంగళవారం జిల్లా మత్య్సకార సహకార సంఘానికి ఎన్నిక నిర్వహించారు. ఈ కేంద్రం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనుచరులు అధిక సంఖ్యలో చేరుకుని హడావిడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే మకాం వేశారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్టర్ల ఎన్నిక, ఆ తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. చివరకు ఎన్నికల్లో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా టీడీపీ సానుభూతి పరుడు సింగిడి పాపారావు, ఉపాధ్యక్షుడిగా దాసరి లక్ష్మణలు ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు.
అధికార దర్పంతో గెలిచారు
అధికార దర్పంతో మత్స్యకార సంఘం ఎన్నికల్లో గెలిచారని జిల్లా మత్య్సకార సంఘం మాజీ అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న ఆరోపించారు. చేపపిల్లల పెంపకం కేంద్రం వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వృత్తిపరమైన ఎన్నికలకు కూడ టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సభ్యులను తరలించి క్యాంప్ రాజకీయాలు నడిపారన్నారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ఇంతలా దిగిజారి పోయారని ఎద్దేవా చేశారు. స్వచ్ఛందంగా సభ్యులు ఓటు వేస్తే గెలవలేమని భావించి సభ్యులను నిర్బంధించారని, ఇదే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అన్నారు. కార్యక్రమంలో మత్య్సకారులు కె.చిన్నారావు, జి.సింహాచలం, జి. అప్పలరాజు, బి.సుదర్శన్‌రావు, పి.లక్ష్మణ్, ఎం.గాంధీ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కేంద్రంవద్ద మంత్రి అనుచరులు, టీడీపీ నేతలు
అధికార దర్పంతో గెలుపు
66 మంది సభ్యులున్న ఎన్నికకు క్యాంప్ రాజకీయాలు
మత్య్సకార సొసైటీ ఎన్నికలకు రాజకీయ రంగు
మత్య్సకార సొసైటీ ఎన్నికలకు రాజకీయ రంగు


