కోర్టు తీర్పు బేఖాతరు
మెంటాడ: న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా మెంటాడ మండలంలోని పిట్టాడ, వాణిజ గ్రామ వీఆర్వో ఆదిరావు భూమిని మ్యూటేషన్ చేసిన ఘటన మండలంలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహరం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాణిజ గ్రామ రెవెన్యూ పరిధిలో 59/2 సర్వే నంబర్లలో సుమారు నాలుగున్నర ఎకరాల మెట్టభూమిలో వ్యవసాయం చేసుకుంటూ బంటుపల్లి సూర్యనారాయణ పెంటమ్మ దంపతులు నివసించేవారు. వారు లక్కోజి సన్యాసమ్మకు 1996లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. బంటుపల్లి సూర్యనారాయణ కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా గత సంవత్సరం డిసెంబర్‌లో పెంటమ్మ మరణించింది. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఇదే అదునుగా అదే గ్రామంలో నివసిస్తున్న బంటుపల్లి సన్యాసిరావు, వీఆర్వో అదిరావులు కలిసి చనిపోయిన దంపతుల భూమిపై కన్నువేశారు. పెంటమ్మ తన సొంత పెద్దమ్మే అని బంటుపల్లి సన్యాసిరావు చేత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌కు వీఆర్‌వో ఆదిరావు దరఖాస్తు చేయించాడు. అన్నీ తానై సర్టిఫికెట్ చేయించి పెంటమ్మ భూమిని బంటుపల్లి సన్యాసిరావు పేరున మార్చేశాడు. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ మేరకు గ్రామంలో సాక్షి విచారణ చేయగా బంటుపల్లి పెంటమ్మకు సన్యాసిరావు ఎలా వారసుడవుతాడంటూ గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. ఇదిలా ఉంటే భూమికొన్న లక్కోజి సన్యాసమ్మను ఈ భూమిపైకి వస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. మరోదారిలేక సన్యాసమ్మ కోర్టును ఆశ్రయించగా భూహక్కుదారులకు అనుకూలంగా తీర్పునిస్తూ, రికార్డుల్లో మార్పులు చేయవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రికార్డులు మార్చడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీఆర్వో పాత్రపై విమర్శలు
ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక వీఆర్వో అన్నీ తానై వ్యవహరించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాల కంటే తమకే అధికారం అన్నట్లు వ్యవహరిస్తూ, అవతలి పక్షం నుంచి లబ్ధి పొంది రికార్డులను ఆన్‌లైన్‌లో మ్యుటేషన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండానే క్షేత్రస్థాయిలో ఈ మాయాజాలం జరిగినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం తీర్పు అమలు కాకపోవడమే కాకుండా, అక్రమంగా మ్యుటేషన్ జరగడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై లక్కోజు సన్యాసమ్మ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ కాపీలు చూపించినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. రికార్డులు ఎలా మారుస్తారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అక్రమ మ్యుటేషన్‌పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వీఆర్వో, ఇతర రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తన భూమిని తనకు అప్పగించాలని కోరుతోంది.
వివాదాస్పదంగా మ్యుటేషన్
అనర్హులకు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్
భూహక్కుదారుల ఫిర్యాదుతో
వెలుగులోకి నిర్వాకం
చక్రం తిప్పిన మెంటాడ మండల వీఆర్వో
కోర్టు తీర్పు బేఖాతరు


