పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీలు
● 232 వినతుల స్వీకరణ
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 232 వినతుల స్వీకరించగా వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతుల పరిష్కారంలో ఆలస్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి వారం పీజీఆర్‌ఎస్ పై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలపై వెంటనే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్ట్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పీజీఆర్‌ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 110పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ నంబర్‌కు వచ్చిన కాల్స్‌ను సరైన సమాధానం అందించాలని సూచించారు. స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 136, పంచాయతీ శాఖ 26, పోలీస్ శాఖ 10, పబ్లిక్ హెల్త్ 10, మున్సిపల్ పరిపాలన 9, సర్వేల్యాండ్ రికార్స్5, వ్యవసాయ శాఖ 4, విద్యుత్ శాఖ 4, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ 3, ఎస్సీ కార్పొరేషన్‌కు రెండు, దేవాదాయ శాఖ 2, మెడికల్ ఎడ్యుకేషన్ 2, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 2, సమగ్రశిక్షక్ష 2, వాటర్‌రిసోర్సెస్‌కు 2 వినతులు స్కీకరిచారు. వినతుల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలా గాంధీ, బి.శాంతి, సర్వేశాఖ ఎ.డి ఎస్‌వీవిజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభం
ప్రజా ఫిర్యాదుల శ్రీఘ్ర పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్‌ఎస్‌లో భాగంగా విజయనగరం జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్‌ను సోమవారం ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా రికార్డుల ఆధారంగా సాధ్యమైనంత వరకు ఆన్‌ది స్పాట్‌లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తహసీల్దార్లు, ఆర్‌డీఓల సమక్షంలో పిటిషనర్లకు నేరుగా పరిష్కారం అందించడం లేదా ఫ్యాక్టువల్ సమాచారం ఇవ్వనున్నట్లు వివరించారు. అన్ని పిటిషన్లను డేటాబేస్‌లో నమోదు చేసి, వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తిని సాధించేలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గత 3–4 నెలల్లో జిల్లాలో పీజీఆర్‌ఎస్ సంతృప్తికరమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. పిటిషన్ల పరిష్కారానికి సాధారణంగా ఒక వారం టైమ్‌లైన్ నిర్ణయించామని, కొన్ని ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) కేసులు మిగహా మిగతావాటిని వేగంగా పరిష్కరించి ప్రజల సంతృప్తిని పెంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో అర్హత ఆధారంగా వెరిఫికేషన్ చేసి తగు చర్యలు తసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 19 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ చాంబర్ లోనే సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్లకు చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీ చాంబర్ వద్దే ఆవేదన వెళ్లగక్కింది. తనను చిత్రహింసలు పెడుతున్నారని, బూతులు తిడుతున్నారంటూ తనకు న్యాయం చేయాలని డీపీఓలో ఎస్పీ వాహనం వద్దే ఆందోళనకు దిగింది. అక్కడే ఉన్న వుమెన్ కానిస్టేబుల్ ,ఆ ఫిర్యాదుదారు రాలిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఎస్పీని కలిపించారు. ఇక ఎస్పీ ఛాంబర్ లోనే ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ దామోదర్ 19 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీలు
పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీలు


