రామతీర్థంలో నేడు ఉత్తర ద్వార దర్శనం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పూజలకు సర్వం సిద్ధంమైంది. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం వేకువజామున 3గంటలకు స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించనున్నారు. అనంతరం తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్ధ గోష్ఠి కార్యక్రమాలను అర్చకులు జరిపిస్తారు. ఉదయం 5గంటలకు సీతారామచంద్ర స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవాన్ని జరిపించనున్నారు. అనంతరం బోదికొండ మెట్ల మార్గం వద్ద మెట్లోత్సవం, గోపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. భక్తుల రద్దీ నేపధ్యంలో దేవాదాయ, పోలీస్ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
పూర్తికాని గిరి ప్రదక్షిణ రహదారి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం గిరి ప్రదక్షిణ జరగనుంది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు కాలినడకన చెప్పులు లేకుండా సుమారు ఎనిమిది కిలోమీటర్లు భక్తి శ్రద్ధలతో నడిచి స్వామిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఈ రహదారిని ఎనిమిదేళ్ల క్రితమే గ్రావెల్ రహదారిగా మార్చి సిద్ధం చేశారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రహదారిలో మట్టిని వేసి రహదారికి మోక్షం కల్పించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో గిరి ప్రదక్షిణ రహదారి(తారు రోడ్డు) నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చే ముక్కోటి ఏకాదశికే సిద్ధం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాదైనా సిద్ధమవుతుందేమోనని ఎదురు చూసిన భక్తులకు చివరికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం సగం వరకు చిప్స్(రాళ్ల పిక్కలు) మాత్రమే వేసి వదిలేయడంతో ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి చేసేశామంటూ సోషల్‌మీడియాలో ప్రచారం
రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేశామని, ఓ రూపుకు తీసుకువచ్చామని, తామే మార్గం సిద్ధం చేశామని..ఇలా ఎమ్మెల్యే లోకం నాగమాధవి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని చూసి భక్తులు నవ్వుకుంటున్నారు. ఆ రహదారిని కొత్తగా వాళ్లే సృష్టించినట్లు ప్రచారం చేసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు తారు వేస్తేనే కదా పూర్తయినట్లు అన్నది భక్తుల అభిప్రాయం. వాస్తవానికి మంజూరైన రూ.2కోట్ల నిధులు సరిపడకపోవడం వల్లనే రహదారి నిర్మాణం పూర్తి కాలేదని ఆ పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. గిరి ప్రదక్షిణ రహదారిలో వేసిన చిన్న చిన్న చిప్స్ కాళ్లకు గుచ్చుకునే ప్రమాదం ఉందని భక్తుల్లో ఆందోళన నెలకొంది. నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు.
రామతీర్థంలో నేడు ఉత్తర ద్వార దర్శనం
రామతీర్థంలో నేడు ఉత్తర ద్వార దర్శనం


