ప్రజలలో సంతృప్తి స్థాయి పెరగాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీల పరిష్కారం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 144 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించి 55 అర్జీలు, 89 అర్జీలు వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రీ ఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలను స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తల్లికి వందనం మంజూరు చేయాలి
● సీతానగరం మండలం సీతానగరం గ్రామానికి చెందిన టి.ఉమ తన కుమారుడికి తల్లికి వందనం పథకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది.
● పార్వతీపురం మండలం హిందూపురం గ్రామానికి బి.వెంకటరమణ తప్పెటగుళ్లు బృందానికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసి, రిజిస్టర్ చేయాలని, జిల్లాలో నిర్వహించే సంబరాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేశారు.
● సీతానగరం మండలం రేపటివలస గ్రామానికి చెందిన పి.సుమలత జీవనోపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది.
● పార్వతీపురం పట్టణానికి చెందిన పి.రజని, భామిని మండలం భామినికి చెందిన టి.సరస్వతి వితంతువు పింఛన్ మంజూరు చేయాలని, సీతానగరం మండలం పాపమ్మవలస గ్రామానికి చెందిన ఎన్.అప్పలనాయుడు దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోరారు.
ఫిర్యాదులపై చర్యల నివేదిక పంపాలి
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ వారం కార్యక్రమంలో 5 ఫిర్యాదులు అందాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ, ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై నివేదికను కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ఈ వేదికను వినియోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఎస్సై రమేష్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 15 వినతులు
సీతంపేట: ఐటీడీఏలో ఏపీఓ జి.చిన్నబాబు సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వివిధ సమస్యలపై 15 అర్జీలు వచ్చాయి. తిడ్డిమికి చెందిన నీలారావు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు. పెద్దగుమ్మడ స్కూల్‌కు ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని బగదల గ్రామస్తురాలు జన్ని వరలక్ష్మి విన్నవించింది. రోలుగుడ్డికి కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామానికి చెందిన కె.నరేష్ వినతిపత్రం అందజేశాడు. లోకొండ పంచాయతీని విభజించవద్దని కె.ఎర్రన్నాయుడు కోరాడు. ట్రైకార్ రుణం ఇప్పించాలని మంగయ్య, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో పేరు వేరేగ్రామంలో ఉందని తమ గ్రామానికి మార్చాలని కొంటికర్రగూడ గ్రామస్తుడు సవర గోపాల్ విన్నవించారు. కార్యక్రమంలో పీహెచ్‌వో ఎస్.వి.గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈవో రామ్మోహన్‌రావు, జీసీసీ మేనేజర్ జి.నరసింహులు, పీఆర్ జేఈ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలలో సంతృప్తి స్థాయి పెరగాలి
ప్రజలలో సంతృప్తి స్థాయి పెరగాలి


