మా క్లినిక్‌కు వచ్చేయండి..
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఆర్. దీపక్‌వర్థన్‌కు రోడ్డు ప్రమాదంలో చేయి విరగడంతో స్థానిక సర్వజన ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఎముకల వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని అతడ్ని ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. అయితే అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో సరైన పరికరాలు లేవని.. అంబటిసత్రం ప్రాంతంలో తనకు సొంత క్లినిక్ ఉందని.. అక్కడకు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రోగి ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లారు. ఆ క్లినిక్‌లో ఒకసారి ఫిజియోథెరపీ చేసినందుకు రోగి నుంచి రూ. 1500 వసూలు చేసినట్లు సమాచారం. అలాగే ఇదే మండలానికి చెందిన ఆర్. వరలక్ష్మి అనే మహిళ మెడనొప్పితో సర్వజన ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ విభాగానికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెను కూడా ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. ఈమెను కూడా సదరు ఫిజియోథెరపిస్ట్ తన సొంత క్లినిక్‌కు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పాడు. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె అతని క్లినిక్‌కు వెళ్లలేదు. ఇలా వీరిద్దరిరే కాదు ఫిజియోథెరపీ విభాగానికి వస్తున్న ప్రతి రోగినీ ఆయన తన ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లాలని సూచిస్తున్నాడు. దీంతో రోగులు బయటకు చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. ఇదిలా ఉంటే సదరు ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో అందుబాటులో ఉండడని గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆ సమయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు రాకపోవడం విశేషం.
రోగుల తరలింపే లక్ష్యం..
ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగినీ తన క్లీనిక్‌కు తరలింపే లక్ష్యంగా సదరు ఫిజియోథెరపిస్ట్ ప్రయత్నిస్తున్నాడు. పక్షవాతం బారిన పడిన వారికి, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఫిజియోథెరపీ
తప్పనిసరి. ప్రభుత్వాస్పత్రిలో మంచి సదుపాయాలున్నప్పటికీ, ఫిజియోథెరపిస్ట్ స్వార్థం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కోసం వచ్చిన వారికి ఇక్కడే చేయాలి. ఇతర క్లినిక్‌లకు తరలించడానికి వీల్లేదు. అలా తరలించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
సర్వజన ఆస్పత్రిలో ఓ ఫిజియోథెరపిస్ట్ నిర్వాకం
ఆస్పత్రిలో మంచి పరికరాలు లేవని
రోగులను మభ్యపెడుతున్న వైనం
గత్యంతరం లేక ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్తున్న రోగులు
వారి నుంచి వేల రూపాయలు
గుంజుతున్నట్లు ఆరోపణలు


