సిద్ధం
వేసవిని ఎదుర్కోవడానికి
● మే నెలాఖరు వరకూ తాగునీటికి ఢోకా లేదు
● జలాశయాలు, భూగర్భ జలాలు ఆశాజనకం
● తోటపల్లి, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టులపై దృష్టి
● చురుగ్గా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు
● కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి జూలైకల్లా సొంత క్యాంపస్
● ‘రెల్లి’ భూముల్లో కేంద్ర గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ
● సాక్షి ఇంటర్వ్యూలో విజయనగరం కలెక్టరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
జిల్లాలో మార్చి నెల నుంచి సూరీడు మండిపోతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిపోతున్నాయి. రానున్న ‘వేసవి’ కాలాన్ని ఎదుర్కోవడానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా ప్రజలకు అభయమిచ్చారు. తాగునీటి సరఫరా ప్రణాళికతో పాటు జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సాక్షి: ‘వేసవి’ సమస్యలపై ప్రణాళిక ఏమిటి?
కలెక్టర్: జిల్లాలోని బోర్లన్నీ ఇప్పటికే శుభ్రం చేయించాం. తాగునీటి సరఫరా విషయానికొస్తే విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో రెండ్రోజులకోసారి, రాజాం మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో ప్రతిరోజూ ఇస్తున్నాం. ప్రస్తుతానికి తాగునీటికి కొరతలేదు. భూగర్భ జలాలు, జలాశయాల్లో నీటిమట్టం ఆశాజనకంగానే ఉన్నాయి. మే నెలాఖరు వరకూ ఢోకా ఉండదని అంచనా వేస్తున్నాం. మండల స్థాయిలో అధికారులతో సమీక్షిస్తున్నాం. ఎక్కడైనా సమస్య ఎదురైతే ట్యాంకర్లతో సరఫరా చేయాలని ఆదేశాలిచ్చాం.
సాక్షి: విజయనగరం జిల్లా కేంద్రానికి పుష్కలంగా తాగునీరు అందించడానికి ఉద్దేశించిన తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి?
కలెక్టరు: విజయనగరానికే కాదు త్వరలో ప్రారంభంకానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన నీటిని తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు నుంచే సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటికే 44 శాతం పనులు పూర్తయ్యాయి. మిగులు పనులు పూర్తి చేయడానికి తాజా అంచనా ప్రకారం రూ.807.55 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించాం. ఇది పూర్తయితే 16,538 ఎకరాల భూమికి సాగునీరు కూడా అందుతుంది.
సాక్షి: తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పనుల మాటేమిటి?
కలెక్టరు: జిల్లాలో అదనంగా 23,119 ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో తలపెట్టిన తోటపల్లి కుడి ప్రధాన కాలువ పనులు 86 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.105.63 కోట్లు మేర నిధులు అవసరమవుతాయి.
సాక్షి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తవుతాయా?
కలెక్టరు: గత ఏడాది జూలై నాటికి 31.80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 67.92 శాతానికి చేరాయి. భూమి చదును పనులైతే గత జూలై నాటికే 97 శాతం అయిపోయాయి. దీంతో మిగతా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. రన్‌వే నిర్మాణ పనులు 96 శాతం, టాక్సీ వే పనులు 84.45 శాతం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నిర్మాణ పనులు 64.22 శాతం పూర్తయ్యాయి. 2026 డిసెంబర్ 13 నాటికి తొలి దశ పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలన్న నిర్దేశిత గడువులోగానే సిద్ధం చేస్తామని జీఎంఆర్ ఏరో ప్రతినిధులు చెబుతున్నారు.
సాక్షి: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సొంత క్యాంపస్ పనుల పురోగతి ఎంతవరకూ వచ్చింది?
కలెక్టరు: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి సొంత క్యాంపస్ అందుబాటులోకి వస్తుంది. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మెంటాడ మండలంలో భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జాతీయ రహదారి నుంచి క్యాంపస్ వరకూ అప్రోచ్ రోడ్డుకు కొంతమేర భూసేకరణకు, తాగునీటి సరఫరా మిగులు పనులు, విద్యుద్ధీకరణకు రూ.29.15 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదించాం. ఇవన్నీ పూర్తయితే 561 ఎకరాల్లోనున్న సువిశాల, ఆహ్లాదకరమైన వాతావరణంలోని సొంత క్యాంపస్‌కు జూలైనాటికల్లా వెళ్లిపోవచ్చు. గతంలో కొత్తవలస మండలంలో రెల్లి వద్ద కేటాయించిన 526 ఎకరాలను కేంద్ర గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాం.
సాక్షి: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా గతంలో జిల్లా అధికారులు రెల్లి వద్ద ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కు పరిస్థితి ఏమిటి?
కలెక్టరు: ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ ప్రణాళిక ఉంది. ఇందుకోసం చీపురుపల్లి నియోజకవర్గంలో పది ఎకరాలు, గజపతినగరంలో 57.49 ఎకరాలు, విజయనగరంలో 12, రాజాంలో 20, బొబ్బిలిలో వంద, ఎస్.కోటలో 57, నెల్లిమర్లలో 19 ఎకరాలు స్వాధీనం చేశాం.
సాక్షి: వైద్య వసతుల కల్పన మాటేమిటి?
కలెక్టరు: విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ రెండో దశ పనులు జరుగుతున్నాయి. కిడ్నీ రోగుల కోసం మరో ఐదు డయాలసిస్ యూనిట్లు పెట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఇందుకు రూ.కోటి వరకూ అవసరం. వీటి నిర్వహణకు ప్రతి నెలా రూ.4 లక్షల వరకూ ఖర్చు అవుతుంది.
సిద్ధం


