వివాహిత ఆత్మహత్య
పూసపాటిరేగ : మండలంలోని ఎరుకొండ గ్రామంలో అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకొని మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు, మృతురాలు బంధువుల కథనం మేరకు పూసపాటిరేగ ఎస్పీ కాలనీకి చెందిన పాండ్రికి పుష్ప(19)కి ఎరుకొండ గ్రామానికి చెందిన శొంఠ్యాన శివతో మూడు నెలలు క్రితం వివాహం జరిగింది. వివాహ సయంలో శివ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు అదనపు కట్నం కోసం డిమాండు చేయడంతో ఇరువురు గ్రామాల పెద్దలు సర్ది చెప్పి అత్త వారింటికి పుష్పను కాపురానికి పంపించారు. అప్పటి నుంచి పుష్పను అత్తవారు వేధించడంతో మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అత్తింటి వారి వేధింపులు తాళలేకే తమ కుమార్తె మృతి చెందిందని తల్లి పాండ్రంకి రమ కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


