ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రుపొందించినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సాహవంతులైన రైతులను మార్గదర్శకులుగా ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమం అమలు చేయడానికి మండల స్థాయి అధికారులతో ఈ నెలఖారున ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, ఉద్యాన శాఖాధికారి చిట్టిబాబు, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీల పట్టివేత
బొబ్బిలి రూరల్: ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి పూట చెరువుల్లో మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్న మట్టి లోడుతో ఉన్న నాలుగు టిప్పర్ లారీలను కలవరాయి గ్రామం వద్ద రెవెన్యూ శాఖ ఆర్‌ఐ రామకుమార్ పట్టుకున్నారు. తహసీల్దార్ శ్రీనుకు అందిన సమాచారం మేరకు మంగళవారం నిఘా పెట్టిన రెవెన్యూ వర్గాలు అర్థరాత్రి కాపుకాసి కలవరాయి గ్రామంలో చెరువు నుంచి బొబ్బిలి పట్టణ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు టిప్పర్లతో మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. మైనింగ్ శాఖ ఇచ్చిన గణాంకాల మేరకు మట్టి లోడును పరిశీలించి 50వేల రూపాయిల జరిమానా విధించారు. మొదటిసారి జరిమానాతో విడిచిపెడుతున్నామని, మరో మారు అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తే కేసులు పెడతామని యజమానికి, కాంట్రాక్టర్‌ను తాహసీల్దార్ శ్రీను హెచ్చరించారు.
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి : కలెక్టర్


