వినియోగదారులకు చేరువగా కన్జ్యూమర్ కమిషన్
● వినియోగదారుల కమిషన్ చైర్మన్
ఆర్.వెంకట నాగసుందర్
విజయనగరం అర్బన్: వినియోగదారుల సౌకర్యార్థం కన్జ్యూమర్ కమిషన్ వినియోగదారులకు చేరువవుతుందని ఆ కమిషన్ చైర్మన్ ఆర్.వెంకట నాగసుందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు అన్యాయం జరిగినప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భయం లేకుండా కన్జ్యూమర్ కమిషన్‌న్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు. వినియోగదారు సొంత ప్రాంతంలోనే కేసు దాఖలు చేసుకునే సౌకర్యం ఉందని, ఆఫిడవిట్ ద్వారా కూడా వ్యవహారం సాగుతుందని చెప్పారు. ఒరిజినల్ బిల్లులు లేకపోయినా ఫొటోస్టాట్ కాపీలతో కేసు నమోదు చేయవచ్చని, సాధారణంగా మూడు నెలల్లో కేసులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జేసీ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ విద్యార్థులకు వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు వినియోగదారుల వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ–కామర్స్ కొనుగోళ్లలో ఉత్పత్తి వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ పరిశీలించాల్సిన అవసరాన్ని వివరించారు. ఫిర్యాదులను ఆన్‌లైన్, కన్జ్యూమర్ కమిషన్ లేదా పీజీఆర్‌ఎస్ ద్వారా చేయవచ్చన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు బి.శ్రీదేవి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో వినియోగదారుడి పాత్ర కీలకమని అన్నారు. మరో సభ్యులు అశోక్‌కుమార్ శర్మ డిజిటల్ న్యాయ పాలనపై మాట్లాడుతూ, ఈ–జాగృతి యాప్ ద్వారా కోర్టుకు రాకుండానే కేసు ఫైల్ చేయవచ్చని, కొనుగోలులో కలిగే నష్టాన్ని నమోదు చేయవచ్చని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించిన విద్యార్థులు
వ్యాసరచనలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి గంట్యాడ హైస్కూల్‌కు చెందిన వి.దీక్షిత, వక్తృత్వ పోటీలలో భోగాపురానికి చెందిన కళాశాల విద్యార్థిని కె.జయలక్ష్మి సాధించారు. వ్యాసరచన పోటీలలో గంట్యాడకు చెందిన కళాశాల విద్యార్థిని ఎ.ఝాన్సీలక్ష్మి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం, గంట్యాడకు చెందిన హైస్కూల్ విద్యార్థిని ఎన్.నిరీక్షణ రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించారు. వినియోగదారుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి మూడు బహుమతులు పొందిన 24 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ మురళీనాథ్, డీవీఈఓ తవిటినాయుడు, సంస్కృత ఉన్నత పాఠశాల హెచ్‌ఎం లలితకుమారి, పలువురు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


