సంప్రదాయానికి ప్రతీక కందికొత్తలు
● రేపటి నుంచి ప్రారంభం కానున్న పండగ
గుమ్మలక్ష్మీపురం: గిరిజనుల ఆచార సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే పండగల్లో ప్రధానమైనది ‘కంది కొత్తల పండగ’. అన్ని వర్గాల ప్రజలు వైభవంగా జరుపుకునే వినాయకచవితి, దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది తదితర పండగల తరహాలో మన్యం ప్రాంత గిరిజనులు ప్రతీ సంవత్సరం చివరి నైలెన డిసెంబర్‌లో ఈ కంది కొత్తల పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగకు ఎంతటి ప్రాధాన్యముందంటే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టించి పని చేసి కొండ పోడులో సాగు చేసిన పంటలైన కందులు, గంటెలు, జొన్నలు, రాగులు, కొర్రలతో పాటు దిగుబడొచ్చిన వరి పంటను ఈ పండగ పూర్తయితేగాని ఏ ఒక్క గిరిజనుడు ఆహారంగా తీసుకోరు. ఈ పంటలు చేతికి అందివచ్చిన సందర్భంగా ఎంతో సంతోషంగా గ్రామ దేవతలకు కంది కొత్తల పండగ పేరుతో భక్తిశ్రధ్ధలతో పూజలు చేస్తారు. అలాగే కొత్త పంట దినుసులను ఆరగిస్తారు. దీనిని బట్టి గిరిజనులు ఈ పండగను ఎంత ఆచారంగా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. కంది కొత్తల పండగ ప్రారంభం రోజూ అందరూ కొత్త బట్టలు ధరించి, మేళ తాళాలతో గ్రామదేవతకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. తరువాత రోజు నుంచి గ్రామ దేవత ప్రతి రూపంగా కొలిచే గొడ్డలమ్మ(గొడ్డలి), ఛత్తరమ్మ(నెమలి పింఛాలు)లను పరిసర గ్రామాల్లో ఊరేగిస్తూ ఆడా, మగా, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఐక్యమత్యంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాంప్రదాయ రీతిలో థింసా నృత్యాలు చేస్తారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా గిరిజన గ్రామాల్లో అందరూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ వారం రోజుల పాటు ఈ పండగను నిర్వహిస్తారు. జన్నోడు, దీసరోడు, ఎజ్జోడుగా పిలువబడే పూజరి సూచనల మేరకు ఆయా గ్రామాల్లో ఈ పండగను నిర్వహిస్తారు. వీరి సూచనల మేరకే దేవతలుగా పిలుచుకునే గొడ్డలమ్మ, ఛత్తరమ్మలను గ్రామాల్లోకి తీసుకురావడం, పూజలు చేయడం, అనుపోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపఽథ్యంలోనే ఈ ఏడాది కూడా ఈ పండగను ఈ నెల 26 నుంచి (శుక్రవారం) ఘనంగా నిర్వహించుకునేందుకు ఇరిడి, తాడికొండ, తోలుఖర్జ, మంగళాపురం, ఎగువ తాడికొండ, కొత్తగూడ, నేరేడుమానుగూడ తదితర గ్రామాల గిరిజనులు సన్నాహాలు చేస్తున్నారు.
సంప్రదాయానికి ప్రతీక కందికొత్తలు


