24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు
పాలకొండ: నగర పంచాయతీ పరిధిలోని కొండాపురం గ్రామ సమీపంలో పంచముఖ గాయత్రి దేవి ఆలయంలో మంగళవారం పట్టపగలు జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ మేరకు సీఐ ప్రసాద్ బుధవారం ఇందుకు సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు. నగర పంచాయతీలోని సుందరయ్యనగర్ (భుట్టిమఠం) కాలనీకి చెందిన భార్యాభర్తలు పసల చిన్నారావు (22), బమ్మిటి దుర్గా (20) మంగళవారం ఉదయం గాయత్రి దేవి ఆలయంలో దర్శనం కోసం వెళ్లారు. అ సమయంలో అర్చకులు అక్కడ లేకపోవడంతో అమ్మవారి గర్భగుడిలో ప్రవేశించి అమ్మవారి మంగళ సూత్రాలు, కళ్లు, ముక్కుపుడక తస్కరించి అక్కడ నుంచి జారుకున్నారు. అర్చకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై ప్రయోగమూర్తి రెండు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. బుధవారం వీరిని వాహన తనిఖీల సమయంలో పట్టుకున్నారని తెలిపారు. నిందితుడు చిన్నారావుపై ఇప్పటికే పోక్సో కేసు నమోదైందని వివరించారు. నిందితులు చోరీ చేసిన 24గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును ఛేదించడంలో సిబ్బంది కృషిని సీఐ అభినందించారు. ఆయనతో పాటు ఎస్సై ప్రయోగమూర్తి, ట్రైనీ ఎస్సై హేమలత ఉన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు పండగ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెలవులకు ఇంటికి తాళం వేసి వెళ్తే బంగారు ఆభరణాలు లాకర్‌లో పెట్టుకోవాలని, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


