మంత్రి సంధ్యారాణి పీఏ కేసులో ట్విస్ట్
సాక్షి, పార్వతీపురం మన్యం:
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఏ సతీష్, ఆమె కుమారుడిపై మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్‌రెడ్డి తెలిపారు. ఆమె ఉద్దేశపూర్వకంగా ఫేక్ కేసులు పెట్టేశారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్, కుమారుడు పృథ్వీ తనను వేధిస్తున్నట్లు సాలూరుకు చెందిన త్రివేణి అనే ఉద్యోగిని కొద్దిరోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, అదే సమయంలో రెండో వర్గం నుంచి కూడా ఫిర్యాదు అందిందని చెప్పారు. రెండు ఫిర్యాదులపై విచారణ జరిపి, వారి ఫోన్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. నిపుణుల పరిశీలనలో సతీష్, మంత్రి కుమారుడు పృథ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్ చాట్‌లన్నీ అబద్ధమని తేలిందన్నారు. త్రివేణి, ఆమె స్నేహితుడు దేవిశ్రీప్రసాద్ కలిసి తప్పుడు చాట్‌లు సృష్టించి సతీష్, పృథ్వీలను బెదిరించారని పేర్కొన్నారు.
ఫిర్యాదు చేసిన మహిళే నిందితురాలిగా...
బాధితురాలిగా ఫిర్యాదు చేసిన మహిళనే నిందితురాలిగా పోలీసులు తేల్చారు. అలాంటిది ఆమెను గానీ, దేవీశ్రీప్రసాద్‌ను గానీ మీడియా ముందుకు తీసుకురాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వారిని మీడియా సమావేశానికి తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
సతీష్, త్రివేణి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి
సతీష్‌కు, త్రివేణికి మధ్య గతంలో ఉద్యోగం విషయమై ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఇదే విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని తెలిపారు. ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్ అనే మున్సిపల్ ఉద్యోగితో కలిసి ఆమె పలుమార్లు సతీష్‌ను బెదిరించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే గత నెల 24న సతీష్ ఆమె ఇంటికి వెళ్లి గొడవపడ్డాడని చెప్పారు. దీంతో సతీష్‌పై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆమె మంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఫిర్యాదులతో మీడియా ముందుకొచ్చినట్లు గుర్తించామన్నారు. త్రివేణి, దేవిశ్రీప్రసాద్‌లపై ఫోర్జరీ, ఛీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు వివరించారు.
మహిళా ఉద్యోగిని తప్పుడు ఫిర్యాదు చేశారు
ఆమె చూపించిన వాట్సాప్ మెసేజ్‌లన్నీ అబద్ధం
స్నేహితుడితో కలిసి ఆమె తప్పుడు మెసేజ్‌లు సృష్టించారు
వాటి ద్వారా మంత్రి కుమారుడు, పీఏలను బెదిరించారు
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వెల్లడి


