తల్లి వెంటే తనయ...
గుర్ల: తల్లి అంటే ఆమెకు ప్రాణం. తల్లి మరణంతో తల్లఢిల్లింది. ఆమె భౌతిక కాయాన్ని పట్టుకుని బోరున ఏడ్చింది. ఆ క్రమంలో కుప్పకూలి ఆస్పత్రిపాలైంది. అక్కడే ప్రాణం విడిచిన ఘటన గుర్ల మండలం చింతపల్లిపేటలో చోటుచేసుకుంది. తల్లిని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... చింతపల్లిపేటకు చెందిన సోమురోతు అప్పలనర్సమ్మ (60) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. తల్లిని చివరిగా చూసేందుకు విశాఖపట్నం నుంచి వచ్చిన కుమార్తె గౌరి (39) తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లికి ఓ వైపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేస్తూనే మరోవైపు గౌరిని చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే సోమవారం అర్థరాత్రి సమయంలో మృతి చెందింది. 24 గంటల వ్యవధిలో తల్లీకుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గౌరి భర్త శంకరరావు విశాఖపట్నం పోర్టులో కూలిపని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. వారికి కుమారుడు హర్షవర్థన్, కుమార్తె కుసుమ ఉన్నారు.
మృత్యువులోనూ వీడని తల్లీకూతుళ్ల
అనుబంధం
తల్లిని కడసారి చూసేందుకు వచ్చి మృత్యుఒడిలోకి..
విలపిస్తున్న కుటుంబ సభ్యులు
చింతపల్లిపేటలో విషాదం
తల్లి వెంటే తనయ...


