భోగాపురం, విజయనగరంలో ఏసీబీ సోదాలు
విజయనగరం క్రైమ్/భోగాపురం:
ఏసీబీ అధికారుల సోదాలతో విజయనగరం, భోగాపురంలో అలజడి నెలకొంది. ఏకకాలంలో ఏసీబీ బృందాల సోదాలతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. గత నెల 5, 6, 7 తేదీల్లో భోగాపురం సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో తనిఖీలు జరిపిన అధికారులు ఈ సారి సబ్‌రిజిస్ట్రార్ పి.రామకృష్ణ ఇంటిలోను, కార్యాలయ ఆఫీస్ బోయ్ అలేటి కనకరాజు ఇంటిలో సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమ్య, సీఐ మహేష్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. భోగాపురంలో కనకరాజు ఇంటికి మంగళవారం ఉదయం 6 గంటలకే డీఎస్పీ రమ్మ తన బృందంతో చేరుకుని సోదాలు జరిపారు. రాత్రి వరకు జరిపిన సోదాల్లో ఆయన వద్ద అక్రమంగా ఉన్న రూ.18లక్షల10వేల నగదు, 40తుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో ఉన్న వస్తువులు, డాక్యుమెంట్లతో పాటు కనక రాజు, అతని భార్య బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. ఆయా ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. డీఎస్పీ రమ్య ఆదేశాల మేరకు సీఐ మహేష్ సిబ్బందితో కలిసి విజయనగరంలోని ఎస్‌వీఎన్ నగర్‌లో నివసిస్తున్న సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణ ఇంటిలో సోదాలు జరిపారు. దాదాపు రూ.మూడు కోట్లు విలువచేసే భవనాల డాక్యుమెంట్లు, రూ.25 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. రామకృష్ణకు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. విజయనగరంలోని ఎస్‌వీఎన్ నగర్, ప్రదీప్‌నగర్, దాసన్న పేట కుమ్మరివీధి, ప్రదీప్‌నగర్–1, ఉడాకాలనీ, కంటోన్మెంట్, వీటీ అగ్రహారంలో బినామీ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. రామకృష్ణ అత్త, తోడల్లుడి పేరుతో ఆస్తులు కూడబెట్టారని, వాటిని సీజ్‌చేశామని సీఐ తెలిపారు.
భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ ఇంటిలో అక్రమ ఆస్తుల గుర్తింపు
కార్యాలయ బోయ్ ఇంటిలో
పట్టుబడిన నగదు, బంగారం
గతనెలలో సబ్‌రిజిస్ట్రార్
కార్యాలయంలో సోదాలు
అనతికాలంలోనే తనిఖీలతో
ఉద్యోగుల్లో గుబులు
ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన సోదాలు
భోగాపురం, విజయనగరంలో ఏసీబీ సోదాలు


