
పనుల్లో పాతాళం
అంచనాల్లో అందలం..
వికారాబాద్: జిల్లాకు మణిహారంగా ఉన్న కోట్‌పల్లి సాగునీటి ప్రాజెక్ట్ తీవ్ర వివక్షకు గురవుతోంది. ప్రాజెక్టు అభివృద్ధి నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. వికారాబాద్, తాండూరు రెండు నియోజకవర్గాలకు చెందిన 18 గ్రామాల వ్యవసాయ పొలాలకు నీరందించాల్సిన ఈ ప్రాజెక్టు అభివృద్ధి అంచనాలు.. ప్రతిపాదనలకే పరిమితమవుతూ వస్తోంది. దీంతో కాల్వలు పూడుకుపోయి.. ఆనకట్ట, అలుగు మరమ్మతులకు గురవుతున్నాయి. తూములు మరమ్మతులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కేవలం రెండు గ్రామాలకు మాత్రతమే సాగునీరందుతోంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలోనూ ఈ ప్రాజెక్టును విస్మరించారు. ప్రాజెక్టు అభివృద్ధి తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చి మూడు నెలలు గడిచినా పనుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో ప్రాజెక్టు పట్టాలెక్కనుందా.? గతం మాదరిగా ప్రకటనలకే పరిమితమా అనే చర్చలు వినిపిస్తున్నాయి. నిధులు మంజూరు చేయించామని చెబుతున్న రెండు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1.57 టీఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తయితే కుడి, ఎడమ, బేబీ కెనాల్ మూడు కాల్వల ద్వారా 9,200 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.
20 పర్యాయాలు ప్రతిపాదనలు
కోట్‌పల్లి ప్రాజెక్టు 20 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. ఒకటి రెండు సార్లు స్వల్ప నిధులు మంజూరైనా పొదల తొలగింపు, కాల్వలు, తూముల మరమ్మతులు చేయించామని చెప్పి చేతులు దులుపుకొన్నారు. రూ.3 కోట్లతో ప్రారంభమైన ప్రతిపాదనలు రూ.110 కోట్లకు చేరాయి. గడిచిన రెండు దశాబ్ధాలలో 15 పర్యాయాలు ప్రతిపాదనలు పంపినా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టలేదు. గడిచిన ఐదేళ్లలో ఐదు సార్లు ప్రతిపాదనలు పంపంగా రాష్ట్ర స్థాయి అధికారులు ప్రాజెక్టును సందర్శించి వెళ్లారే తప్ప ఎటువంటి పురోగతి కనిపించలేదు. గత మూడు నెలల క్రితం రూ.89.3 కోట్లతో కోట్‌పల్లి ప్రాజెక్టుకు పాలనా పరమైన అనుమతులు వచ్చాయి. టెండర్ ప్రాసెస్ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతూనే ఉంది. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టడంలో ప్రతీసారి అడ్డంకులు ఎదురవుతుండగా అందులో ఓ ప్రైవేటు సంస్థ బోటింగ్ పేరుతో నిర్వహిస్తున్న వ్యాపారానికి మాత్రం ఏ అడ్డంకులు కలగటంలేదు.
15 వేల ఎకరాలకు సాగు నీరు
దశాబ్దాల కాలంగా మరమ్మతులు చేపట్టక కాల్వలు పూర్తిగా పాడయ్యాయి. అలుగు పారే చోట పెద్ద ఎత్తున ధ్వంసమైంది. ప్రాజెక్టు కట్ట సైతం చాలా చోట్ల మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం మంజూరైన నిధులతో కుడి, ఎడమ కాల్వలతో పాటు బేబీ కెనాల్ పాడైన చోట మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. పూర్తిగా పాడైన చోట కొత్తగా కాల్వలు నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టు కట్ట పాడైన నేపథ్యంతో కట్టను బలంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అలుగు మరమ్మతులు చేపడితేనే నీటి ప్రవాహం ఆపే వీలుంటుందని ఇంజినీర్లు వెళ్లడిస్తున్నారు. ప్రాజెక్టును పునరుద్ధరిస్తే 15 వేల ఎకరల వరకు సాగునీరందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఓ ప్రైవేటు ఆర్గనైజేషన్ ద్వారా బోటింగ్ చేస్తున్న నేపథ్యంలో రైతులకు నీరు వదలడం లేదని రైతుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన నిధులు వెనక్కి వెళ్లకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయ్యేలా నేతలు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
ఇరవై ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని కోట్‌పల్లి ప్రాజెక్టు
9,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ప్రాజెక్టు రెండు గ్రామాలకే పరిమితం
తాజాగా రూ.89.3 కోట్లతో పాలనాపరమైన అనుమతులు
పనులు పూర్తికి నేతలు చొరవ చూపాలని కోరుతున్న రైతులు