
వ్యాధుల కాలం.. శుభ్రతే మంత్రం
నవాబుపేట: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దోమలు, ఈగలు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం గ్రామాల్లో వర్షపునీరు నిలిచి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో భయంకరమైన సీజనల్ వ్యాధులు సంభవించే ఆస్కారం ఉంది. గ్రామాలు, పట్టణాల్లో మురుగు, వర్షం నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈగ చిన్నదైనా అది ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. ఈగకు కుట్టే గుణం లేకున్నా మెడికల్ ట్రాన్స్‌ఫర్ విధానం వల్ల రోగాలను తెచ్చి పెడుతుందని వైద్య నిఫుణులు చెబుతున్నారు.
వ్యాప్తి ఇలా..
దోమ కాటుతో డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధులతో వస్తున్న రోగాల సంఖ్య కంటే వర్షాకాలంలో కామెర్లు, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దోమ కాటుకు గురైన రోగిని వాక్సిన్ ద్వారా నయం చేయడానికి అవకాశాలున్నాయి. ఈగలతో వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే పరిస్థితి వైద్యులకు పెద్ద తల నొప్పిగా మారుతుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానంగా బహిర్భూమి, అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఈగలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ వేసే చెత్తచెదారంతో పాటు మాంసం, చికెన్ విక్రయ కేంద్రాలు, మురుగు కాలువలు మొదలగు ప్రాంతాల్లో ఈగలు తమ సంతతిని పెంచుకొని ఇళ్లల్లో ప్రవేశిస్తాయి.
వర్షాకాలంలో వచ్చే వ్యాధులు
టైఫాయిడ్: ఎక్కువ రోజుల పాటు జ్వరం తీవ్ర నీళ్ల విరేచనాలు, చీమూ, బంక విరేచనాలతో శరీరంలో ఉండే నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ వస్తుంది. వీటిని టైఫాయిడ్ లక్షణాలుగా గుర్తించాలి.
కలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు రావడం తర్వాత శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ రావడం జరుగుతుంది.
పచ్చ కామెర్లు: కాలేయానికి వాపురావడం, కళ్లు పసుపు పచ్చగా మారడం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండటాన్ని కామెర్లుగా గుర్తించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కాచి, వడబోసిన తాగునీటినే తాగాలి.
ఇంటి పరిసరాలతో పాటు, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
పరిసరాల్లో ఈగలు, దోమలు వ్యాప్తి కారకాలను నిరోధించడం.
అపరిశుభ్ర ప్రదేశాలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.
ఈగలు, దోమలతో పొంచి ఉన్న ప్రమాదం
పారిశుద్ధ్య లేమితో పెరగనున్న సంతతి
ముందస్తు చర్యలు పాటిస్తే మేలంటున్న వైద్యనిపుణులు
పరిశుభ్రతే ముఖ్యం
వర్షాకాలంలో పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. నివాసాలు, పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తినుబండరాలపై ఈగలు వాలకుండా చూసుకోవాలి. వేడి పదార్థాలనే తినాలి. అస్వస్థతకు గురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
– డా.రోహిత్ వేముల, నవాబుపేట

వ్యాధుల కాలం.. శుభ్రతే మంత్రం