
70 గొర్రెలు మృత్యువాత
● రూ.9 లక్షల నష్టం
● ఆదుకోవాలని బాధితుల వేడుకోలు
బొంరాస్‌పేట: హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనాలు ఢీకొని 70 గొర్రెలు మృతిచెందగా మరో 13 తీవ్రంగా గాయపడ్డాయి. మండల పరిధిలోని తుంకిమెట్ల, బొంరాస్‌పేట శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నాందార్‌పూర్ గ్రామానికి చెందిన గిర్మి మల్కప్ప, రాయికంటి ఎల్లప్ప గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. సుమారు 150 జీవాలను మూడు రోజులుగా తుంకిమెట్ల శివారులో మేపుతున్నారు. మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని ఖాళీ స్థలంలో మంద పెట్టారు. పొద్దంతా వానలో తడిసిన మల్కప్ప దుస్తులు మార్చుకునేందుకు ఇంటికి వెళ్లాడు. మంద వద్ద కాపలాగా ఉన్న ఎల్లప్ప కునుకు తీయడంతో వానకు తడిసిన గొర్రెలు ఒక్కొక్కటిగా పక్కనే ఉన్న బీజాపూర్– హైదరాబాద్ హైవే పైకి చేరుకున్నాయి. బొంరాస్‌పేట చెరువు అలుగు సమీపంలోని వంతెన వద్ద గుర్తు తెలియని వాహనాలు ఢీకొనడంతో మల్కప్పకు చెందిన 40 గొర్రెలు, ఎల్లప్పకు చెందిన 30 గొర్రెలు చనిపోయాయి. మరో 13 జీవాలు తీవ్రంగా గాపడ్డాయి. దీంతో తమకు రూ.9 లక్షల నష్టం కలిగిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి, ఆదుకోవాలని కోరారు. ప్రమాద విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తహసీల్దార్ పద్మావతి తెలిపారు. ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నర్సింలుగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, మల్లేశం, యాదయ్య యాదవ్ తదితరులు బాధితులను పరామర్శించారు.
ఆదుకోవాలి
మా అత్తగారి బంగారం అమ్మి రూ.8 లక్షలతో గొర్రెలు కొన్నాం. రూ.6 లక్షలు విలువ చేసే 40 జీవాలు చనిపోయాయి. సీఎం సారు స్పందించి ఆదుకోవాలి. – గిర్మి మల్కప్ప
అప్పు చేసి తెచ్చుకున్నాం
గొర్రెల పెంపకమే మా బతుకుదెరువు. కునుకుపాటులో జీవాలను కోల్పోయాం. రూ.3 లక్షల వరకు నష్టపోయా. ఏం చేయాలో, ఎవరిని అడుగాలో తోచడంలేదు. – ఎల్లప్ప

70 గొర్రెలు మృత్యువాత

70 గొర్రెలు మృత్యువాత

70 గొర్రెలు మృత్యువాత