
ఇక రెండు రోజులే!
తాండూరు: గ్రామీణ విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభను వెలికి తీసేందుకు తాండూరులో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నైపుణ్య విద్యలో శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించింది. కానీ అధికార యంత్రాంగం విద్యార్థులకు ఏటీసీ నైపుణ్య విద్యపై అవగాహన పెంచడంలో విఫలమైంది. గడువు దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. మరో రెండు రోజుల వ్యవధిలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.
అందుబాటులో ఆరు కోర్సులు
జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా తాండూరు కొనసాగుతోంది. విద్యార్థులకు నైపుణ్య విద్యపై శిక్షణ అందించేందుకు రూ.85 కోట్ల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. దీనికి పట్టణ శివారులో ఐదు ఎకరాల్లో రూ.25 కోట్లతో భవనాన్ని నిర్మించారు. రూ.60 కో ట్ల నిధులను కేటాయించి విద్యార్థులకు శిక్షణ కల్పించేందుకు కావాల్సిన సాంకేతిక, యంత్ర సామగ్రి కేంద్రానికి చేరుకున్నాయి. ఈ సెంటర్‌లో మొత్తం 172 మంది విద్యార్థులకు శిక్షణ కల్పించేందుకు సీట్లు ఉన్నాయి. ఆరు కోర్సులపై దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అందులో ఇండస్ట్రీయల్ రోబోటిక్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్(ఏడాది), మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్(ఏడాది), ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్(ఏడాది), బీడీవీవీ వర్చువల్ ఏనాలసెస్ అండ్ డిజైనర్(రెండేళ్లు), సీఎస్‌సీ మెషినింగ్ టెక్నీషియన్(రెండేళ్లు), మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్(రెండేళ్లు) ఏటీసీ సెంబర్ ద్వారా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇవ్వనున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు పదో తరగతి మెమో, బోనఫైడ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డు, టీసీ తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.
ఖాళీగా 132 సీట్లు
ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు ఏటా ఆగస్టు నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. తాండూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రంలో మొత్తం 172 మందికి శిక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏటీసీలో 40 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇంకా 132 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
తాండూరు ఏటీసీ ప్రవేశాలకు ముగుస్తున్న గడువు
పది, ఇంటర్ డ్రాపౌట్ విద్యార్థులకు సదవకాశం
నైపుణ్యం మెరుగు పరిచేలా శిక్షణ
అనంతరం ఉద్యోగ కల్పనకు చొరవ
శిక్షణ పొందితే భవిష్యత్
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో ఈ విద్యా సంవత్సరానికి ఇంకా 132 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో ఏటీసీ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వం సీట్ల భర్తీకి గడువు పెంచే అవకాశం ఉంది.
– సాయన్న, ప్రిన్సిపాల్, ఏటీసీ, తాండూరు
జాబ్ గ్యారంటీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఐటీఐ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాను. అందులో భాగంగా ఏటీసీ ఏర్పాటు చేశాం. విద్యార్థులు నైపుణ్య విద్యపై శిక్షణ తీసుకునే అవకాశం కల్పించాం. ఇక్కడ నైపుణ్యం అందించేలా నిష్ణాతులైన అధ్యాపకులను నియమించాం. శిక్షణ పొందితే జాబ్ పక్కాగా వస్తోంది.
– మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు

ఇక రెండు రోజులే!