
ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి సీజ్
పరిగి: పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న తరగతిని మంగళవారం అధికారులు సీజ్ చేశారు. మండల విద్యాధికారి గోపాల్ పాఠశాలను సందర్శించి ఎలాంటి అనుమతులు లేకుండానే 9వ తరగతి పాఠాలు నిర్వహిస్తుండటంతో నోటీసులు జారీ చేసి తరగతి గదిని సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. ఎన్ని తరగతుల వరకు అనుమతులు ఉంటేనే అంత వరకే తరగతులు నిర్వహించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఏసీ సిబ్బంది శ్రీశైలం, మోహన తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ పాఠశాల హెచ్‌ఎంగా వెంకటయ్య
దౌల్తాబాద్: దౌల్తాబాద్ సీపీఎస్ హెచ్‌ఎంగా వెంకటయ్య నియమితులయ్యారు. ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా చిట్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వెంకటయ్య పదోన్నతి పొంది దౌల్తాబాద్ బాలికల ప్రాథమిక పాఠశాలకు హెచ్‌ఎంగా వచ్చారు. ఇక్కడ ఇన్‌ఛార్జి పనిచేస్తున్న సాయిలు, పదోన్నతి పొందిన హెచ్‌ఎం వెంకటయ్యను స్థానిక ఉపాధ్యాయులు సన్మానించారు.
పురుగు మందు కలిపిన నీటిని తాగి..
15 మేకలు మృత్యువాత
బంట్వారం: తొట్టిలో కలిపిన పురుగు మందు నీటిని తాగి 15 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన కోట్‌పల్లి మండలంలోని ఎన్నారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శైలజ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నారానికి చెందిన వెల్చాల్ రాసయ్య తన పొలంలో గడ్డి మందు కొట్టేందుకు నీటి తొట్టిలో పురుగు మందు కలిపి మూత పెట్టలేదు. అదే గ్రామానికి చెందిన అంజయ్య మేకలు మేపుతూ వస్తుండగా సమీపంలోని తొట్టిలో నీటిని తాగి 15 మేకలు మృత్యువాత పడ్డాయి. అంజయ్య కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శైలజ తెలిపారు.
తామర పూలు కోసేందుకు వెళ్లి..
వ్యక్తి మృతి
పరిగి: గణపతి పూజకు తామర పూలు తెచ్చేందుకు చెరువులోకి దిగిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మిట్టకోడూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. దోమ మండలం ఉదన్‌రావుపల్లికి చెందిన బాలయ్య(55), కృష్ణయ్య తామర పూలు కోసేందుకు మిట్టకోడూరు చెరువు వద్దకు వచ్చారు. చెరువులోకి దిగి తామర పూలు కోస్తుండగా బాలయ్య కాళ్లకు తామర తీగచుట్టుకుని నీట మునిగి గల్లంతయ్యాడు. గమనించిన కృష్ణయ్య ఒడ్డుకు చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పంచాయితీ కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృత దేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య బాగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలో పేకాట రాయుళ్లను కరన్‌కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రాథోడ్ వినోద్ తెలిపిన వివరాల ప్రకారం.. కరన్‌కోట్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది మంగళవారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.9,460తో పాటు పేక ముక్కలను స్వాధినం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి సీజ్

ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి సీజ్

ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి సీజ్

ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి సీజ్