
రైతుల కష్టం.. వర్షాలతో నష్టం
● చేతికొచ్చిన పంటలు నీటిపాలు
● ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు
బషీరాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షాలకు పాడయ్యాయి. కోతకొచ్చిన పెసర, మినుము పంటలు నీటిపాలయ్యాయి. భారీ పెట్టుబడులతో సాగు చేసిన పత్తి పంటలు సగానికిపైగా నీట మునిగాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని.. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక
బషీరాబాద్ మండల రైతులకు వర్షాధార పంటలే దిక్కు. వానాకాలంలో 32,728 ఎకరాల్లో పత్తి, కంది పెసర, మినుము పంటలు సాగుచేశారు. ఇందులో పత్తి 13,057 ఎకరాలు, కంది 14,885 ఎకరాలు, పెసర 1,269 మినుము 372 ఎకరాల్లో సాగు చేశారు. వారం క్రితం కురిసిన భారీ వర్షాలకు సగానికి పైగా పాడైనట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెసర, మినుము పంటలకు 90 శాతం నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగ్నా పరివాహక ప్రాంతాలైన మంతట్టి, కంసాన్‌పల్లి, జీవన్గి, క్యాద్గీరా, గంగ్వార్, నావంద్గి, ఇందర్‌చెడ్ పరిధిలో పత్తిపంటలు వదర ముంపునకు గురయ్యాయి. ఇదే విషయమై మండల వ్యవసాధికారిణి అనితను సంప్రదించగా పంటల నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు.
కాత మొలక వస్తోంది
నాలుగు ఎకరాల్లో పెసర పంట సాగు చేశా. కోతకొచ్చే సమయంలో ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో పంట పాడైంది. 70 శాతం మేర పంట నష్టం వాటిళ్లింది. పొలంలో ఇప్పటికీ బురద ఉండడంతో పంట కోయడానికి సైతం వీలులేకుండా పోయింది. వర్షానికి తడిసి కాత మొలకెత్తుతోంది. గింజలు రంగుమారాయి. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి.
–నర్సింలు, రైతు, కాశీంపూర్
కంది పంట పాడైంది
కాగ్నానది పక్కన నాలుగు ఎకరాల్లో కంది పంట సాగు చేశా. భారీ వర్షాల కారణంగా కాగ్నానది ఉప్పొంగి పొలాలు వరద ముంపునకు గురయ్యాయి. కంది పంట పూర్తిగా పాడైంది. రూ.20 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఒక్క కంది మొలక మిగల లేదు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి.
– భీంరెడ్డి, రైతు, నావంద్గి

రైతుల కష్టం.. వర్షాలతో నష్టం

రైతుల కష్టం.. వర్షాలతో నష్టం

రైతుల కష్టం.. వర్షాలతో నష్టం