
‘ఇందిరమ్మ’పై ఫోకస్
జిల్లాకు రెండు విడతల్లో 28 వేలు మంజూరు ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారులు 6,281 మంది మొదటి విడత చెక్కు అందుకున్న వారు 2,034 మంది రూ.లక్ష చొప్పున రూ.25.88 కోట్లు చెల్లింపులు పూర్తయిన ఇళ్లు 6
స్థానిక ఎన్నికల్లోపు కొన్ని ఇళ్లయినా ప్రారంభించాలనే యోచనలో సర్కారు
వికారాబాద్: స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ అధికారులు సంక్షేమంపై దృష్టి సారించారు. అభయహస్తం ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పనుల్లో వేగం పెంచేందుకు సిద్ధమయ్యారు. స్థానిక పోరు నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఆరు నెలలుగా సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ తదితర పథకాలపై ఫోకస్ పెట్టారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ శాఖలో ఇంజనీర్ల కొరత ఆటంకంగా మారుతోంది.
6,505 ఇళ్లకు మార్కింగ్
జిల్లాకు రెండు విడతల్లో 24 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో 2,309, రెండో విడతలో 9,372 ఇళ్లు కేటాయించారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. 6,505 ఇళ్లకు మార్కింగ్ కూడా చేశారు. 2,034 మంది పునాది పనులు పూర్తి చేయడంతో వారి ఖాతాల్లో లక్ష చొప్పున రూ.20.34 కోట్లు జమ చేశారు. మరో 156 మంది రూప్ లెవెల్ వరకు పూర్తి చేయగా వారికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.3.12 కోట్లు జమ చేశారు. మరో 53 మంది రూప్ కాస్ట్ లెవెల్ వరకు పూర్తి చేయగా వారికి రూ.4 లక్షల చొప్పున రూ.2.12 కోట్లు అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు ఇళ్లు పూర్తి కాగా ఒక్కొక్కిరికి రూ.5 లక్షల చొప్పున చెల్లించారు. అయితే ఇంజనీర్ల కొరత కారణంగా పనులు వేగంగా సాగడం లేదని తెలిసింది. హౌసింగ్ శాఖలో ముగ్గురు డీఈలు, 14 ఏఈలు మాత్రమే ఉన్నారు. వీరికి పర్యవేక్షణ కష్టంగా మారింది.
స్థలాలు లేని వారికి ఎప్పుడో?
ప్రస్తుతం స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. స్థలాలు లేని వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశా లు జారీ చేయలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం మధ్యలో ఆపేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్లయినా తమకు కేటాయించాలని కోరుతున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాకు 5,740 డబుల్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 2,257 వివిధ దశల్లో ఉన్నాయి. 1,031 చిన్న చిన్న పనులు మినహా పూర్తి కావచ్చాయి. మరో 512 కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయి.ధారూరులో 120 ఇళ్లు, మర్పల్లిలో 120, యాలాల మండలం కోకట్‌లో 180, తాండూరు పట్టణంలో 401, పరిగిలో 180, చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో 30 పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని తమకు కేటాయించాలని స్థలం లేని పేదలు కోరుతున్నారు.