యూరియాపై భరోసా కల్పించండి | - | Sakshi
Sakshi News home page

యూరియాపై భరోసా కల్పించండి

Aug 29 2025 7:14 AM | Updated on Aug 29 2025 7:14 AM

యూరియాపై భరోసా కల్పించండి

యూరియాపై భరోసా కల్పించండి

● రైతులు ఆందోళన చెందొద్దు ● వారం రోజుల్లో మరో 640 మెట్రిక్‌ టన్నుల సరఫరా ● కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

అనంతగిరి: యూరియా దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో యూరియా లభ్యత, నానో యూరియా వాడకం, చెక్‌ పోస్టుల ఏర్పాటు తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా పంపిణీపై రైతులకు భరోసా కల్పించాలన్నారు. జిల్లాకు ఇప్పటి వరకు 20,124 మెట్రిక్‌ టన్నుల యురియా వచ్చిందని తెలిపారు. వారం రోజుల్లో మరో 640 మెట్రిక్‌ టన్నులు రానున్నట్లు చెప్పారు. సొసైటీల్లో 184 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 596 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. మార్క్‌ ఫెడ్‌ సొసైటీలకు 100 మెట్రిక్‌ కన్నులు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు యూరియా అక్రమంగా తరలించకుండా సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద నిఘా పెంచామన్నారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సుధీర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం, ఏడీఏ సందీప్‌ కుమార్‌, ఏడీలు సౌభాగ్యలక్ష్మి, శంకర్‌ నాయక్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

చిత్తశుద్ధితో పనిచేయాలి

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. గురువారం ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించారు. సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుందని.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ విధానాన్ని సక్రమంగా నిర్వహించాలని, తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధన చేయాలన్నారు. ఎంఈఓలు ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శించి సమస్యలు లేకుండా చూడా లని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఈఓ రేణుకాదేవి పాల్గొన్నారు.

మొక్కలు నాటిన కలెక్టర్‌, ఎస్పీ

వికారాబాద్‌ పట్టణంలోని జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో గురువారం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, జిల్లా అదనపు ఎస్పీ (డీటీసీ ప్రిన్సిపాల్‌) పీవీ మురళీధర్‌, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్‌ డీఎస్పీ వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఏటీసీల్లో కోర్సులు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు, వికారాబాద్‌, మోమిపేట్‌లో యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆగస్టు 30 వరకు కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో టిగెట్‌ వైస్‌ చైర్మన్‌ సరిత, ఐటీఐ ప్రిన్సిపాల్‌ నాగేంద్రబాబు, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి ఎస్‌ఏ సుభాన్‌, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ సరోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement