లక్ష్మీదేవిపల్లిలో కదలిక! | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీదేవిపల్లిలో కదలిక!

Aug 29 2025 7:14 AM | Updated on Aug 29 2025 7:14 AM

లక్ష్మీదేవిపల్లిలో కదలిక!

లక్ష్మీదేవిపల్లిలో కదలిక!

చౌదరిగూడలో స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, ఇంజనీర్ల బృందం రంగారెడ్డి – పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఇదే చివరిది 1,512 ఎకరాల విస్తీర్ణం.. 2.8 టీఎంసీల సామర్థ్యం రిజర్వాయర్‌ పూర్తయితే పరిగి, షాద్‌నగర్‌ రైతులకు లబ్ధి

సాక్షి, రంగారెడ్డిజిల్లా/పరిగి: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. పదేళ్ల క్రితమే రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు తట్టెడుమట్టిని కూడా తవ్వలేదు. పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్లుగా అపరిష్కృతంగా మారిన ఈ నిర్మాణ ప్రదేశాన్ని గురువారం ఇరిగేషన్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరెడ్డి, ఈఈ సీతారాం నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం సందర్శించడంతో నిర్మాణ పనుల్లో మరోసారి కదలిక మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. సాంకేతిక అనుమతులకు తోడు నిధుల కేటాయింపు జరిగి, సకాలంలో రిజర్వాయర్‌ పూర్తయితే ఇటు రంగారెడ్డి, అటు వికారాబాద్‌ జిల్లాల్లోని 4.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. మీర్‌ఖా న్‌పేట కేంద్రంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్‌సిటీకి సైతం నీటి సరఫరా కానుంది. తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు తీరనున్నాయి.

పదేళ్ల క్రితమే శంకుస్థాపన

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్‌నగర్‌ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడెం మండలం పద్మారం రెవెన్యూ పరిధిలో 1,512 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 670 మీటర్ల ఎత్తులో.. కట్టపొడవు 6.05 కిలోమీటర్లతో, 2.8 టీఎంసీల సామర్థ్యంతో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ (చివరి ప్రాజెక్ట్‌)నిర్మించాలని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2015 లోనే రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. తర్వాత ప్రభుత్వం ఆశించిన స్థాయి లో నిధులు కేటాయించక పోవడం, పర్యావరణ అనుమతులు రాకపోవడం తదితర సాంకేతిక సమస్యలతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించడం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత జనవరిలో ఇక్కడ పర్యటించి, త్వరలో భూసేకరణ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రిజర్వాయర్‌ నిర్మాణ పనుల పరిశీలన కోసం సాగునీటి పారుదలశాఖ ఇంజనీర్ల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించడంతో జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సత్వరం పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రతి ఎకరాకూ నీరందిస్తాం

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేస్తే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని కట్టకుండా తీవ్ర అన్యాయం చేసిందని పరిగి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యేలు టీ రామ్మోహన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌ ఆరోపించారు. మన ప్రాంతాని కి రావాల్సిన నీటిని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం పరిగి పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుపై అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం చేసిందన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే బీఆర్‌ఎస్‌ వాటిని కాళేశ్వరానికి మళ్లించిందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల కేటాయించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. త్వరలో పనులు ప్రారంభవుతాయాని చెప్పారు. 2.8 టీఎంసీల ప్రాజెక్టును 5 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిందని, తాము పకడ్బందీగా నిర్మి స్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీరందించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ నిధులు కేటాయిస్తే కేసీఆర్‌ వాటిని మళ్లించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీసీఈ భాస్కర్‌, చేవెళ్ల ఎస్‌ఈ సీతారాం, ఈఈ రేణుక, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement