
ఇరుకు చౌరస్తా.. ప్రయాణం అవస్థ
● కొడంగల్ వినాయక కూడలిలో
వాహనదారుల ఇక్కట్లు
● ట్రాఫిక్ సమస్యలు
పరిష్కరించాలని వినతి
కొడంగల్: పట్టణంలోని వినాయక చౌరస్తాను విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు వినాయక చౌరస్తా సమీపంలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది విద్యార్థులు తిరుగుతుంటారు. ప్రతి రోజు ఈ ప్రాంతం రద్దీగా ఉంటోంది. ప్రయాణికులను ఎక్కించుకోడానికి దించడానికి ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడనే ఆపుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వినాయక చౌరస్తాను విస్తరించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు. నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి పట్టణాల్లో ప్రధాన కూడళ్ల విస్తరణకు జాతీయ రహదారుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. మహబూబ్‌నగర్–చించోలీ(ఎంసీ) అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం చించోలీ వరకు జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ జాతీయ రహదారికి 167ఎన్‌గా పేరు పెట్టారు.
విస్తరణకు రూ.630 కోట్లు
మహబూబ్‌నగర్ నుంచి హన్వాడ, గండీడ్, కోస్గి, కొడంగల్, తాండూరు మీదుగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. బెంగళూరు, ముంబాయి జాతీయ రహదారులను కలిపే ఈ రహదారి సుమారు 150 కిలోమీటర్లు పొడవు ఉంది. వికారాబాద్ జిల్లాలో 45 కిలోమీటర్లు, కర్ణాటక రాష్ట్రంలో 50 కిలోమీటర్లు, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 55 కిలోమీటర్ల మేర రహదారి విస్తరించి ఉంది. మహబూబ్‌నగర్–చించోలీ(ఎంసీ) జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.630 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్, కోస్గి, కొడంగల్, తాండూరు మీదుగా చించోలి, మన్నాకెళ్లి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చౌరస్తాను విస్తరిస్తే ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఉండవని స్థానికులు కోరుతున్నారు.
పనులు వేగవంతం చేయాలి
మహబూబ్‌నగర్–చించోలీ(ఎంసీ రోడ్డు) జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలి. వినాయక చౌరస్తాలో ప్రతి రోజు ట్రాఫిక్ జాం అవుతుంది. రాకపోకలు సాగించడానికి విద్యార్థులకు, స్థానికులకు అంతరాయం ఏర్పడుతోంది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా వినాయక చౌరస్తాను విస్తరించి సమస్యలు పరిష్కరించాలి.
– నర్సిరెడ్డి, కొడంగల్

ఇరుకు చౌరస్తా.. ప్రయాణం అవస్థ