
పాపన్నగౌడ్ ఆశయాలు సాధిద్దాం
అనంతగిరి: బహుజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ వర్గాల సమానత్వం, వారి సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాప న్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసితెలంగాణ గడ్డపై దళిత బహుజన మైనారిటీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్ డీఆర్‌ఓ మంగ్లీలాల్, ఆర్డిఓ వాసుచంద్ర, బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా అందుబాటులో ఉంది
వానాకాలం సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా పంపిణీపై దిశానిర్ధేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు నెలకు సంబంధించి 11,200 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, ఇప్పటి వరకు 4,250 మెట్రిక్ టన్నులు విక్రయించడం జరిగిందన్నారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కలిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం, జనరల్ మేనేజర్ మహేశ్వర్, మార్కెటింగ్ శాఖ అధికారి సారంగా పాణి పాల్గొన్నారు.
సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచరాదని, సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్‌ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్, గ్రామ పంచాయతీ, విద్యాశాఖ, ఆసరా పెన్షన్లకు సంబంధించి పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరమ్మతు పనులను పూర్తి చేయాలని సూచించారు. భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.