
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఇబ్రహీంపట్నం: అందివచ్చిన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం్‌లో రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి అండర్–15 బాలుర, బాలికల వాలీబాల్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని, మేధో సంపత్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభాపాటవాలు చాటాలని, క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే విద్యార్థులను పీఈటీలు, పీడీలు ప్రోత్సహించి, వారికి మంచి అవకాశాలు దక్కేలా తమవంతు కృషి చేయాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 25న పుణేలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. పోటీలకు ములుగు జిల్లా మినహా 32 జిల్లాల నుంచి సుమారు 700 మంది వాలీబాల్ క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో గురుకుల విద్యాపీఠం్ ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్‌రావు, మండల విద్యాధికారి హీర్యానాయక్, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్‌రెడ్డి, పీడీ, పీఈటీల సెక్రటరీ ఎండీ షబ్బీర్, క్రీడల అబ్జర్వర్ వెంకట్‌నారాయణ, జోనల్ సెక్రటరీ పీడీ సుశీల పాల్గొన్నారు.