
దరఖాస్తులు 11,718
నోటీసులు జారీ చేసినవి 11,117 అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లే 10వ స్థానంలో జిల్లా
భూ భారతి సమస్యల పరిష్కారానికి 14తో ముగిసిన గడువు
807
పరిష్కారం
వికారాబాద్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా రైతుల నుంచి తీసుకున్న అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. జూన్ 2 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రాగా 3వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కుప్పలు తెప్పలుగా అర్జీలు రావడంతో రెండు నెలలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దరఖాస్తుల పరిష్కార గడువు ఈ నెల 14తో ముగిసింది. కేవలం పది శాతం లోపే పరిష్కారమయ్యాయి. జి ల్లా వ్యాప్తంగా 11,718 దరఖాస్తులు రాగా కేవలం 807ని మాత్రమే పూర్తిస్థాయిలో పరిష్కరించారు. 11,117 సమస్యలకు సంబంధించి అర్జీదారులకు నోటీసులు జారీ చేశారు. మరో 2,147 చివరి దశకు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సమస్యల పరిష్కారంలో జిల్లా 10వ స్థానంలో ఉంది.
ఆప్షన్ లేక డీలా..
భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. కోర్టు పరిధిలో ఉన్న వివాదాలు, వ్యాజ్యాలు మినహా మిగిలిన వాటిని ఆగస్టు 14వ తేదీ నాటికి పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అనేక సమస్యలకు ఆప్షన్ లేకపోవడం అడ్డంకిగా మారుతోంది. వచ్చిన వాటిలో చాలా వరకు డబులు దరఖాస్తులు ఉన్నాయి. మీసేవా కేంద్రాలతో పాటు రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు ఇచ్చారు. సాదాబైనామా దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఆ అర్జీలే అత్యధికం
గత ప్రభుత్వ హయాంలో భూ సమస్యల పరిష్కారం కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించారు. అప్పట్లో కలెక్టర్ లాగిన్‌లో ఐదు వందల అర్జీలు మాత్రమే పెండింగ్‌లో ఉండేవి. రెవెన్యూ కొత్త చట్టం అమలులోకి రావడంతో మళ్లీ వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో మిస్సింగ్ సర్వే నంబర్లు, సాదాబైనామా, అసైన్డ్ భూముల సమస్యలు, పీఓబీ, విరాసత్, మ్యుటేషన్, డేటా కరక్షన్ తదితర దరఖాస్తులు వచ్చాయి. మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 4,013, డీఎస్ పెండింగ్‌కు 1,604, సక్సేషన్‌కు 1,654, ఎక్సెటెంట్ మిస్సింగ్‌కు సంబంధించి 690 దరఖాస్తులు వచ్చాయి. అక్కడికక్కడే కొన్ని పరిపరిష్కరించినవి పోనూ మరో 11,718 దరఖాస్తులు వచ్చాయి.
త్వరగా పరిష్కరిస్తాం
జిల్లా వ్యాప్తంగా పది వేలకు పైగా అర్జీలు వచ్చాయి. ఇప్పటికే పరిశీలన, డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేశాం. కోర్టు పరిధిలో ఉన్న వాటిని, సాదాబైనామా సమస్యలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు పరిష్కరిస్తాం. డబుల్ దరఖాస్తులను పరిశీలించి తొలగిస్తాం.
– లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్