
వానలే వానలు
జాలువారుతున్న పంటపొలాలు వేలాది ఎకరాల్లో నష్టం కుంగిపోతున్న కల్వర్టులు నామమాత్రపు మరమ్మతులతోసరిపెడుతున్న అధికారులు
వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం
వికారాబాద్: జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జాలువారి పంటలు పాడవుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన వర్షాలు మంగళవారం వరకు కురుస్తూనే ఉన్నాయి. సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. వరినాట్లు వేస్తున్న రైతులకు ఈ వానలు ఎంతో ఉపయోగకరం కాగా మిగతా పంటలు వేసిన వారికి శాపంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్ల్లుతోంది. వాగులు పారుతూ చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. దాదాపు అన్ని చెరువులు అలుగు పారుతున్నాయి. పలు చోట్ల లో లెవెల్ వంతెనలపై నుంచి వాగులు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరికొన్ని చోట్ల సాహసం చేసి వాగులు దాటి వెళుతున్నారు. గత వారం పరిగి – వికారాబాద్ మార్గంలోని వంతెన కుంగిపోగా వాహనదారులు అవస్థలు పడ్డారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే మా ర్గంలో మద్గుల్ చిట్టంపల్లి సమీపంలో వాగుపై భారీ గుంత పడింది. మధ్యలో కుంగిపోవడంతో ఇరువైపులా మట్టిపోసి తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
వేల ఎకరాల్లో..
ప్రస్తుత సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ఐదున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 4.5 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. మరో లక్ష ఎకరాల్లో వరి సాగు చేయవచ్చని అధికారులు అంటున్నారు. చెరువులు, కుంటలు, బావులు, బోరు బావుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వరి నాట్లు వేసే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు చేసిన వారు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 50శాతం పంట పొలాలు జాలువారే పరిస్థితి వచ్చింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పది ఇళ్లు కూలిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. వానలు తగ్గుముఖం పట్టి పది రోజుల పాటు ఎండ కాస్తేనే పంటలు గట్టెక్కుతాయని అన్నదాతలు అంటున్నారు. లేకుంటే పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తమైన అధికారులు
వర్షాభావ పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గత అనుభవాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాలోని 20 రోడ్లలో ప్రమాదకర వాగులు, బ్రిడ్జీలను గుర్తించారు. వాటి వద్ద అధికారుల పహారా కాస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి కాలనీలు చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా.. బురదమయంగా మారాయి. పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో అధిక వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి.

వానలే వానలు