
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–15 బాలుర, బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారంతో ముగిసాయి. బాలుర విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రథమ స్థానంలో, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో, మంచిర్యాల తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్, ద్వితీయ స్థానం సూర్యాపేట, తృతీయ స్థానం నారాయణ్‌పేట జిల్లాలు దక్కించుకున్నాయి. విజేతలకు షీల్డ్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి హీర్యానాయక్, గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్‌రావు, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, పీఈటీలు, పీడీలు నాగరాజు, సుధాకర్, షబ్బీర్, చెన్నకిష్టారెడ్డి, భాస్కర్‌రెడ్డి, సుధాకర్, రవికుమార్, బస్వరాజ్, మల్లేష్, బాబయ్య, వెంకటేశ్, శ్రీలత, జోనల్ సెక్రటరీ పీడీ సుశీల తదితరులు పాల్గొన్నారు.
సాదాసీదాగా ముగింపు
రాష్ట్ర స్థాయిలో 32 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్న టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. సాదాసీదా కార్యక్రమం ముగించడంతో క్రీడాకారులు నిరుత్సాహానికి గురయ్యారు.