తిరుపతి అర్బన్ : ఏర్పేడు వ్యాసాశ్రమానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం రాత్రి కలెక్టరేట్‌లో వ్యాసాశ్రమం అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేద్దామన్నారు.విశిష్ట చరిత్ర గల వ్యాసాశ్రమాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పీఠాధిపతుల నేతృత్వంలోనే ఆశ్రమం కొనసాగుతుందని చెప్పారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ఈ క్రమంలోనే ఆశ్రమ శతాబ్ది ఉత్సవాలను కొంతకాలం వాయిదా వేయాలని సూచించారు. ఎస్పీ సుబ్బరాయుడు, డీఆర్‌ఓ నరసింహులు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, బీజేపీ నేత కోలా ఆనంద్ పాల్గొన్నారు.
‘భూ’చోళ్ల అరెస్ట్
– నకిలీ పత్రాలతో దందా
సాక్షి టాస్క్‌ఫోర్స్ : నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్ల భూములను విక్రయించే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. తిరుపతి మంగళం సమీపంలోని తుడా క్వార్టర్స్‌లోని విలువైన భూములను టార్గెట్ చేసుకుని సాగుతున్న ఈ దందాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి, మరకొందరితో కలిసి నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులను సైతం సృష్టించినట్లు తెలుస్తోంది. అనంతరం మధ్యవర్తి ద్వారా రిజిస్ట్రేషన్ పేరుతో కొనుగోలుదారుల నుంచి సుమారు రూ.కోటికి పైగా ఆన్‌లైన్ ద్వారా నగదును కాజేసినట్లు సమాచారం. అయితే పత్రాలపై అనుమానం వచ్చిన బాధితులు, రేణిగుంట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీ చేయగా అవి నకిలీవిగా తేలాయి.. దీంతో బాధితులు వెంటనే తిరుచానూరు పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం వేకుజామున వడమాలపేట టోల్‌ప్లాజా సమీపంలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రహస్య ప్రదేశానికి తరలించి గోప్యంగా విచారణ చేపడుతున్నట్లుగా తెలిసింది. నిందితుల్లో టీడీపీ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిందితులను కాపాడేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


