కొత్త ఫోన్‌.. కొత్త బైకు.. ప్రాణం తీసిన ఫోటోషూట్‌! | Youth's Dies After Going For A Photoshoot In Hyderabad Keesara | Sakshi
Sakshi News home page

కొత్త ఫోన్‌.. కొత్త బైకు.. ప్రాణం తీసిన ఫోటోషూట్‌!

Jun 16 2026 9:42 AM | Updated on Jun 16 2026 9:42 AM

Youth's Dies After Going For A Photoshoot In Hyderabad Keesara

 ఫొటోషూట్‌కు వెళ్లి మృత్యువాత

చెరువులో మునిగి ఒకరి మృతి.. మరొకరి గల్లంతు 

కీసర తిమ్మాయిపల్లి చెరువు వద్ద ఘటన

గల్లంతైన వాలెంటైన్‌ టోని (ఫైల్‌)

కెవిన్‌ ఆంటోని మృతదేహం

కీసర: బంధువులైన ముగ్గురు యువకుల్లో ఒకరు కొత్తగా స్కూటీ, మొబైల్‌ కొన్నారు. ఆ సంతోషంలో కలిసి ఫోటోలు దిగాలనుకున్నారు. అనుకుందే తడవుగా కొత్త బైకుపై ముగ్గురు కలిసి తిమ్మాయిపల్లి చెరువు వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా నీటిలోకి దిగి ఫొటోలు దిగుతుండగా.. ఓ యువకుడి ఇయర్‌ బడ్స్‌ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకునే క్రమంలో నీట మునగగా.. మరో యువకుడు కాపాడేందుకు ప్రయతి్నంచి బురద నీటిలో మునిగిపోయాడు. వీరిని కాపాడేందుకు మూడో యువకుడు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తిమ్మాయిపల్లి చెరువు వద్ద చోటు చేసుకుంది.

కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లారం ఆదర్శ్‌నగర్‌కు చెందిన  కెవిన్‌ ఆంటోని(19) కొత్త స్కూటీ, మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేశాడు. బంధువులైన వాలెంటైన్‌ టోని(20), యాప్రాల్‌కు చెందిన అమోస్‌ జోసఫ్‌లతో కలిసి ఫొటోషూట్‌ చేయాలని భావించి కొత్త స్కూటీపై తిమ్మాయిపల్లి సమీపంలోని పెద్ద  చెరువుకు వచ్చారు. ఈత కొట్టేందుకు ముగ్గురు చెరువులోకి దిగారు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు దిగుతుండగా చెవికి పెట్టుకున్న ఇయర్‌ బర్డ్స్‌ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకునేందుకు వాలెంటైన్‌ టోని వెళ్లాడు. అతని వెనకాలే కెవిన్‌ ఆంటోని వెళ్లాడు. ఇద్దరు నీట మునిగిపోవడం గమనించిన అమోస్‌జోసఫ్‌ వారిని కాపాడేందుకు ప్రయతి్నంచాడు. 

అక్కడ బురదతో పాటు లోతుగా ఉండటంతో వారిద్దరూ నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో కెవిన్‌ ఆంటోని మృతదేహాం వెలికితీశారు. గల్లంతైన వాలెంటైన్‌ టోని కోసం తీవ్రంగా గాలించారు. సాయంత్రం పొద్దుపోయి చీకటిగా ఉండటంతో గాలింపు కష్టమైంది. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు  చేపడుతామని సిఐ తెలిపారు. ఈ మేరకు కేసునమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతిచెందిన  కెవిన్‌ ఆంటోని తల్లిదండ్రుల రోదన మిన్నంటింది.  కాగా ముగ్గురు యువకులు ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేశారు. మృతిచెందిన కెవిన్‌ ఆంటోని, కాపాడేందుకు యతి్నంచిన అమోస్‌ జోసఫ్‌లు ఇద్దరు అక్కాచెల్లెళ్ల పిల్లలు కాగా, గల్లంతైన వాలెంటైన్‌ టోని వీరికి వరుసకు బాబాయి అవుతాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement