తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు | Husband Ends His Wife Life In Mancherial, Family Members Protest On National Highway | Sakshi
Sakshi News home page

తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు

Jun 27 2025 8:51 AM | Updated on Jun 27 2025 10:52 AM

Wife Ends Life in Mancherial

    జాతీయ రహదారిపై కుటుంబ సభ్యుల రాస్తారోకో

    నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్‌ 

మంచిర్యాల: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దర్బాతాండకు చెందిన ఆడె నటరాజన్‌కు 2021లో మామడ మండలం గాయిది పల్లకి చెందిన సుజాత (25)తో వివాహమైంది. మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నటరాజన్‌ కోరమండల్‌ కంపెనీలో పనిచేస్తుండగా సుజాత టైలరింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో గొంతునొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరచూ అదనపు కట్నంకోసం వేధిస్తుండేవాడని, ఈక్రమంలో హత్య చేశాడని ఆరోపించారు. 

నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కాజల్‌ సింగ్‌ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. కాగా బోథ్‌ నుంచి మృతదేహాన్ని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement