మధురానగర్ ప్రచార సభలో కిషన్‌రెడ్డి అభివాదం
దమ్మూ ధైర్యముంటే బీజేపీ–బీఆర్‌ఎస్ ఒక్కటేనని నిరూపించాలి
రేవంత్, కేసీఆర్‌లకు టైముంటే రాష్ట్రానికి కేంద్రం చేసింది వివరిస్తాను
ఢిల్లీలో బీఆర్‌ఎస్–కాంగ్రెస్ ఒప్పందం వాస్తవమా కాదా?
రేవంత్ బ్యాడ్ బ్రదర్స్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆరేనని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి..అనేక ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి, నిరుద్యోగులు, మహిళలను మోసం చేసి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసే, మజ్లిస్‌ను పెంచి పోషించి, వారి కనుసైగల్లో నడిచే బ్యాడ్ బ్రదర్స్ వారేనని ఎద్దేవా చేశారు.
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’అన్నట్టుగా కేటీఆర్, కిషన్‌రెడ్డిలను బ్యాడ్ బ్రదర్స్ అంటూ రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరు ఎవరికి బ్రదర్స్? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? కేసీఆర్‌ను కాపాడుతోంది కాంగ్రెస్ కాదా? రాహుల్‌గాం«దీకి భయపడి వారిపై చర్యలకు ఎందుకు రేవంత్ వెనుకాడుతున్నావు’అని ప్రశ్నించారు.
రేవంత్‌ది ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వమని, బీఆర్‌ఎస్‌ది కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ సర్కార్ అన్నారు. గతంలో కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం, ఇప్పుడు సోనియా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి సోయి తప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
శనివారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాదని, చీమూనెత్తురు, దమ్మూధైర్యం ఉంటే ఏ విషయంలో బీజేపీ–బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయో చూపాలని సవాల్ విసిరారు.
రానున్న రోజుల్లో అసలు ఆట మొదలుపెడతాం
‘రాష్ట్రంలో ఇంకా అసలు ఆట మొదలు కాలేదు. తెలంగాణలో బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తాం. మీరు చేసిన పనులు ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మా ఆట మొదలుపెడతాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల కింద ఉన్న భూమి కదులుతుంది’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం ప్రజల్లోకి వెళ్లేటప్పుడు, తాను ఏం చేశాడో చెప్పి ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాల్సి ఉండగా, అమలు కాని హామీలపై ఒక్కమాట కూడా రేవంత్ మాట్లాడడం లేదన్నారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించే వ్యూహంలో భాగంగానే తనపై, ప్రధాని, బీజేపీపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ‘రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లకు సమయం ఉంటే, తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే..వినే ధైర్యం మీకు ఉందా’అని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్‌గాందీ.. రూ.లక్ష కూడా బయటకు తీశాడా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఢిల్లీ స్థాయిలో బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది వాస్తవం కాదా అని నిలదీశారు. ‘ఫోన్ ట్యాపింగ్, విద్యుత్, ధాన్యం, భూముల కొనుగోళ్ల కేసులు ఏమయ్యాయి? రేవంత్‌రెడ్డీ..ఒక్క బీఆర్‌ఎస్ నేతపైనా చర్యలు తీసుకున్నావా’అని ప్రశ్నించారు.
ఆ రెండు పార్టీలకు ఓటేస్తే మోసపోయినట్లే: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా శనివారం మధురానగర్ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఒక్క సీటు గెలిచినంత మాత్రాన జరిగే మార్పు ఏమీ ఉండదని అన్నారు. ‘బీజేపీకి ఓటు వేసి మోదీకి మద్దతు ఇవ్వండి. రహమత్‌నగర్, వెంగళరావునగర్, బోరబండ కాలనీల్లో కేసీఆర్ ఒక్కసారి పాదయాత్ర చేస్తే ఆయన చేసిన అభివృద్ధి ఏంటో అర్థమవుతుంది. వర్షం వస్తే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి.
ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరు? కేసీఆర్ దీనికి బాధ్యుడు కాదా’అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎంఐఎం చేతిలో కీలు»ొమ్మలుగా మారిపోయాయన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్ కూతురే విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ పార్టీకి మనం ఓటు వేయాలా?’అని ప్రశ్నించారు. మోదీ సంక్షేమ పథకాలను తమ పథకాలంటూ రాష్ట్రంలో పాలన నడిపిస్తున్నారని విమర్శించారు.


