నకిలీ చిరునామాలతో రవాణా శాఖ పౌర సేవలు | Transport Department Civil Services with Fake Addresses | Sakshi
Sakshi News home page

RTA: నకిలీ చిరునామాలతో రవాణా శాఖ పౌర సేవలు

May 10 2025 7:30 PM | Updated on May 10 2025 8:19 PM

Transport Department Civil Services with Fake Addresses

గ్రేటర్‌లోని పలు కేంద్రాల్లో ఆమ్యామ్యాల వ్యవహారం

అక్రమార్జనే లక్ష్యంగా వాహనాల నమోదు, బదిలీలు, లైసెన్సులు

గతంలో ఓ ఆర్టీఓపై క్రమశిక్షణ చర్యలు

అయినా.. యథేచ్ఛగా కొనసాగుతున్న అవినీతి తతంగం

సాక్షి, హైద‌రాబాద్‌: వాహన పర్మిట్‌ బదిలీ కోసం దాని యజమాని నుంచి రూ.40 వేలు వసూలు చేసినట్లు నగరంలోని బండ్లగూడ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారిపై కొద్దిరోజుల క్రితం ఫిర్యాదులు రావడంతో.. అతడిని అక్కడి నుంచి రవాణా కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఇలా  పర్మిట్‌ బదిలీయే కాదు.. అడిగినంత సమర్పించుకుంటే ఎలాంటి సర్వీసులైనా ఇక్కడ తేలిగ్గా లభిస్తాయనే ఆరోపణలున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల బదిలీలు, కొత్త బండ్ల నమోదు సహా వివిధ రకాల పౌరసేవలు ఇక్కడ అంగడి సరుకుల్లా అమ్ముడవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బండ్లగూడ కార్యాలయంలో తప్పుడు చిరునామాలతో వాహన అక్రమ రిజిస్ట్రేష‌న్లకు అడ్డుకట్ట పడటంలేదు. గతంలో ఇదే వ్యవహారంలో ఇక్కడి ఆర్టీఓపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. కాగా.. ఈ అక్రమాల తంతు ఒక్క బండ్లగూడ (Bandlaguda) కార్యాలయంలోనే కాదు.. నగరంలోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో యథేచ్ఛ గా కొనసాగుతున్నట్లు.. ‘ఫేక్‌ అడ్రస్‌’లకు చిరునామాలుగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.    

చిరునామా ఎంతో కీలకం.. 
డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేష‌న్‌లు, చిరునామా బదిలీలు, పర్మిట్‌ బదిలీలు వంటి వివిధ రకాల  సేవల్లో వాహనదారుడి అడ్రస్‌ను ఎంతో కీలకంగా పరిగణిస్తారు. తప్పుడు వ్యక్తులు, అసాంఘిక శక్తుల చేతుల్లోకి  వాహనాలు  వెళ్లకుండా, అలాంటి  వ్యక్తులు  డ్రైవింగ్‌ లైసెన్సులను పొందకుండా నియంత్రించేందుకు కచ్చితమైన అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్‌ గుర్తింపు, బ్యాంకు ఖాతా పుస్తకం, వంటగ్యాస్‌ డాక్యుమెంట్లు, కరెంట్‌ బిల్లు చెల్లింపు రసీదు తదితర 13 రకాల పత్రాలను చిరునామా ధ్రువీకరణకు ప్రామాణికంగా భావిస్తారు.

కాగా.. సదరు వాహనదారు సమర్పించింది నిజమైనవో కాదో నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే పౌర సేవలను అందజేయాలి. కానీ కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో  ఎలాంటి నిర్ధారణ లేకుండానే  పౌరసేవలను అంగడి సరుకుల్లా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయానికి ప్రతిరోజూ సుమారు 120 లెర్నింగ్‌ లైసెన్సులను అందజేస్తే వాటిలో కనీసం 40 వరకు తప్పుడు అడ్రస్‌లపై జారీ చేసినవే ఉంటాయని ఆర్టీఏ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవారివే ఎక్కువగా ఉంటాయన్నారు.

అడ్డుకుంటున్నా ఆగడంలేదు..  
‘వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వారి అడ్రస్‌లను పరిశీలించినప్పుడు మా కార్యాలయం పరిధిలోకి రానివి, తప్పుడు డాక్యుమెంట్‌లను సమర్పించినవి గుర్తించి అడ్డుకుంటున్నాం. కానీ అలాంటి వ్యక్తులు నగరంలో ఇతర ఆర్టీఏ కార్యాలయాల నుంచి యథేచ్ఛగా తమకు కావాల్సిన సర్వీసులను పొందుతున్నారు’’ అని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో (Khairtabad RTO Office) పని చేసే ఒక అధికారి తెలిపారు. ‘ప్రతిరోజూ 100 నుంచి 120 లెర్నింగ్‌లు ఇస్తేనే గిట్టుబాటవుతుందని భావించే సిబ్బంది ఉన్నచోట స్క్రూట్నీ చేస్తే కనీసం 30 శాతం తప్పుడు అడ్రస్‌లే నమోదైనట్లు తేలుతుంది’ అని మరో అధికారి  చెప్పడం గమనార్హం. వాహనదారులు సమర్పించే అడ్రస్‌ పత్రాలు అసలివో, నకిలీవో నిర్ధారించే  వ్యవస్థ లేకపోవడమే  దీనికి కారణమని జూబ్లీహిల్స్‌కు చెందిన డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకులు ఒకరు అభిప్రాయపడ్డారు. 

చ‌ద‌వండి: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement