
హైడ్రా ఠాణా విషయంలో కమిషనర్ కీలక నిర్ణయం
దుర్వినియోగం, బెదిరింపులకు తావులేకుండా చర్యలు
న్యాయశాఖ ఉత్తర్వుల తర్వాత అధికారికంగా పని షురూ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పోలీసుస్టేషన్ కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దురుద్దేశాలతో కూడిన, తప్పుడు ఫిర్యాదులకు చెక్ చెప్పడానికి ప్రాథమిక విచారణ (పీఈ) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఈ విచారణ పూర్తి చేసి, నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాతే హైడ్రా ఠాణాలో కేసు నమోదవుతుంది. ప్రతి ఫిర్యాదును కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి, సిఫార్సు చేసిన తర్వాతే పోలీసుస్టేషన్‌కు చేరుతుంది. హైడ్రా పోలీసుస్టేషన్ డిజిగ్నేటెడ్ కోర్టుకు సంబంధించి న్యాయశాఖ ఉత్తర్వులు జారీ తర్వాత అధికారికంగా పని చేయడం ప్రారంభించనుంది.
కొన్ని ఫిర్యాదుల వెనుక అనేక ఉద్దేశాలు..
ప్రభుత్వ భూములు, లే అవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పార్కులు, చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలకు సంబంధించిన కేసుల్ని హైడ్రా ఠాణా నమోదు చేయనుంది. వీటితో పాటు నిర్మాణాల కోసం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వంటి వాటిని ధ్వంసం చేసినా పరిగణనలోకి తీసుకుంటోంది. ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ముందుకు వెళ్తున్న హైడ్రా (Hydraa) అధికారులు తీవ్రమైన అంశాలు, నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ వంటివి గుర్తిస్తున్నారు. ఆయా ఆక్రమణల్ని తొలగించడంతో పాటు బాధ్యులపై స్థానిక ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా.. హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని వ్యక్తిగత విభేదాలు, కక్షసాధింపు చర్యలు, బెదిరింపుల దందాలతో ముడిపడి ఉంటున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ రంగనాథ్ హైడ్రా ఠాణాలో కేసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అవసరమైతే సుమోటో కేసులు..
కబ్జాలు, ప్రజా ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ఫిర్యాదు చేయాలని భావించిన వారు నేరుగా హైడ్రా ఠాణాకు వెళ్లినా వెంటనే కేసు నమోదు కాదు. ఆ ఫిర్యాదును జనరల్ డైరీలో (జీడీ) ఎంట్రీ చేసే సిబ్బంది కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. కమిషనర్ సిఫార్సు మేరకు సిబ్బంది విచారణ చేపడతారు. ఫిర్యాదుతో జత చేసిన పత్రాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులతో పాటు ఆయా శాఖలు, విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తారు.
ఈ వివరాలతో పీఈ పూర్తి చేసి.. నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు జోడించి కమిషనర్‌కు నివేదిక ఇస్తారు. ఆపై ఆయన ఆమోదంతో కేసు నమోదవుతుంది. నేరం ఏ సంవత్సరంలో జరిగిందో పరిగణనలోకి తీసుకునే ఎస్‌హెచ్‌ఓ ఆరోపణలు జోడిస్తారు. ఇప్పటికే వేర్వేరు ఠాణాల్లో నమోదైన కేసుల్ని విడతల వారీగా హైడ్రా స్టేషన్‌కు బదిలీ చేయనున్నారు.
చదవండి: పాకిస్థాన్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు