కానీ.. ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు: రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy Comments On BRS Party | Sakshi
Sakshi News home page

కానీ.. ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు: రేవంత్‌రెడ్డి

Oct 18 2025 7:41 PM | Updated on Oct 18 2025 7:57 PM

CM Revanth Reddy Comments On BRS Party

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు యువత ఆకాంక్షలను రాజకీయాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వారి కుటుంబం కోసమే గత పాలకులు ఆలోచించారు. గత పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపద పెంచుకున్నారంటూ ఆరోపించారు.

‘‘గత పదేళ్లలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేదు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఎకరానికి రూ.కోటి సంపాదించే విద్య ఉందని గత పాలకులు చెప్పారు. కానీ ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు. గత పాలకులు వారి కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారు. కానీ గ్రూప్‌-2 నియామకాలు చేపట్టాలని ఆలోచించలేదు’’ అంటూ రేవంత్‌ దుయ్యబట్టారు.

‘‘విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నాం.

..మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్-1  విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్

..మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement