కాంగ్రెస్‌కు బిగ్‌ ఝలక్‌.. బీఆర్‌ఎస్‌ ‘బాకీ కార్డు ఉద్యమం’ | BRS Unveils “Congress Baaki Card” Campaign Alleging Broken Promises by Telangana Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బిగ్‌ ఝలక్‌.. బీఆర్‌ఎస్‌ ‘బాకీ కార్డు ఉద్యమం’

Sep 27 2025 12:57 PM | Updated on Sep 27 2025 1:28 PM

BRS Party Stand With Congress Due Card Program In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్‌.. రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని మొదలుపెట్టింది.

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈరోజు ‘బాకీ కార్డు’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయన్నారు. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపుతట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని  స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన దోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా తెలంగాణ ప్రజలకు వచ్చిందన్నారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయి పడిందో నిలదీసి నిగ్గదీసి అడగడానికే ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్డును ఇంటింటికీ తీసుకెళ్తారని చెప్పారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

..‘మోసపోతే గోస పడతామని ఎన్నికలకు ముందు కేసీఆర్ పదే పదే చెప్పారు. అదే నేడు నిజమైందన్నారు కేటీఆర్. మొదటి కేబినేట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటి వరకు  30కి పైగా కేబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదని విమర్శించారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నేడు మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధును కూడా బంద్ చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘కాంగ్రెస్ బాకీ కార్డు’లోని ప్రతీ అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని కేటీఆర్ మండిపడ్డారు. ఏ వర్గాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిలువునా ముంచిందో ఆయన అంకెలతో సహా వివరించారు. అన్నదాతల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేస్తున్నది. ఎకరానికి రూ.15,000 ఇస్తామన్న హామీ ఏమైంది?. రెండు లక్షల రుణమాఫీ ఊసేలేదు. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారు, అది కూడా బాకీనే. ఇక కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను పట్టించుకునే నాథుడే లేడు. వారికి ఇస్తామన్న 15,000, 12,000 ఏ గంగలో కలిపారు? ఇవన్నీ బాకీ కాదా? అని నిలదీశారు.

..మా తమ్ముళ్లు, చెల్లెళ్ల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. రెండు లక్షల ఉద్యోగాల హామీ బాకీ. నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ప్రతి నిరుద్యోగికి వేలల్లో బాకీ పడింది. ఈ మోసానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది? అని ప్రశ్నించారు.

..మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. నెలకు 2,500 ఇస్తామని చెప్పి, ఈ రోజుకు ఒక్కో మహిళకు దాదాపు 55,000 బాకీ పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక పెళ్లైన 8 లక్షల మంది ఆడబిడ్డలకు 8 లక్షల తులాల బంగారం బాకీ. ఇది నయవంచన కాదా? అని మండిపడ్డారు.

..వృద్ధులు, వితంతువుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదు. నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ఒక్కొక్కరికి 44,000 బాకీ పడ్డారు. దివ్యాంగుల విషయంలో మరీ దారుణం. నెలకు 6,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేసీఆర్ పెంచిన 4,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే ప్రతి నెలా 2,000 కోత పెడుతూ, ఒక్కో దివ్యాంగుడికి 44,000 బాకీ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల తరఫున గొంతు విప్పుతున్న తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత వేధించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఓవైపు న్యాయపరంగా పోరాడుతూనే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నయ వంచనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఈ బాకీ కార్డులను ముద్రించామని, తెలంగాణ ప్రజలను జాగృతం చేసే ఈ ప్రచారానికి మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement