
సాక్షి, హైదరాబాద్: తాను ఏ తప్పూ చేయలేదు. ఏ విచారణకైనా సిద్ధం.. అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లై డిటెక్టర్ టెస్ట్‌కు తాను సిద్ధం.. రేవంత్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రానే కారణమంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
‘‘మెట్రోపై ప్రభుత్వ నిర్ణయం బాధ్యతారాహిత్యం. మా హయాంలో మెట్రోకు మరింత ఊతమిచ్చాం. మెట్రో తొలి దశను మూడేళ్లలో పూర్తి చేశాం. మెట్రోకు రూ.900 కోట్లు రుణం కూడా ఇచ్చాం. మేం ఉన్నప్పుడు మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండేది. ఎయిర్‌పోర్టు వరకు విస్తరించాలని గతంలో నిర్ణయించాం. రేవంత్ రాగానే మా ప్రతిపాదనలు రద్దు చేశారు. నిర్మాణం చేపట్టి ఉంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
‘‘నాకు భూములు ఉన్నాయని.. ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేశారనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఎల్ అండ్ టీతో పంచాయితీ మొదలైంది. పెట్టుబడిదారులను రేవంత్ బెదిరించారు. ఎల్ అండ్ టీ ఎందుకు వెళ్లిపోయిందో రేవంత్ చెప్పాలి. హైదరాబాద్‌కు ఇది మాయని మచ్చ’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
