సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఏపీ నేతలకు విదేశాల నుండి డ్రగ్స్ ఎలా దొరుకుతోంది? అని ప్రశ్నించారు. కూటమి నేతలు ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారో? డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారో తేల్చాలి అని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్లిపోయింది. నెల్లూరులో డ్రగ్స్ మాఫియా పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేసింది. హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్‌తో దొరికారు. విదేశాల నుండి డ్రగ్స్ ఏపీ నేతలకు ఎలా దొరుకుతోంది?. డ్రగ్స్ మీద అవగాహన కల్పించామని హోంమంత్రి అనిత చెప్తున్నారు. మరి మీ కూటమి నేతలు డ్రగ్స్ తీసుకుంటూ ఎలా దొరికారు?
ఒకప్పుడు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవారు. ఇప్పుడు ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ అనే పేరు తెచ్చిపెట్టారు. కూటమి నేతలు ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారో? డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారో తేల్చాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వమో, ఇంటర్ పోలో విచారణ జరపాలి. గంజాయి, డ్రగ్స్ మాఫియా నుండి ఏపీని కాపాడాలి. సుధీర్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు.


