సాక్షి, హైదరాబాద్/వైఎస్సార్: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని(Sudheer Reddy) తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో, నార్సింగి పోలీసులు.. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్టు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శనివారం ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే డ్రగ్స్(గంజాయి) సేవిస్తున్న కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో, సుధీర్‌కు డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్‌గా తేలింది. అనంతరం, సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. డీఅడిక్షన్ సెంటర్‌కు పంపించారు.
ఈ క్రమంలో సుధీర్‌తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక, గతంలో కూడా సుధీర్ రెడ్డి రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటం గమనార్హం. ఇదిలా ఉండగా.. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. డ్రగ్స్ కేసు నుంచి తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.




