పులివెందుల డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

పులివెందుల డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోండి

Feb 27 2026 7:36 AM | Updated on Feb 27 2026 7:36 AM

పులివ

పులివెందుల డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోండి

పులివెందుల : పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌, రూరల్‌ సీఐ వెంకటరమణలపై నాలుగు వారాల్లోగా చర్యలు చేపట్టాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కడప జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. పులివెందుల వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ పార్నపల్లె కిశోర్‌తోపాటు మరో 13మందిపై 2025 మే 29న పులివెందులలో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా పులివెందుల టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో రింగ్‌ రోడ్డు సర్కిల్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారు. వాటిని తొలగించారని రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కిశోర్‌తోపాటు మరికొందరిపై అక్రమ కేసు నమోదు చేశారు.

డీఎస్పీ, సీఐలు ఆది నుంచే వివాదాస్పదులే..

పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌, రూరల్‌ సీఐ వెంకటరమణలు ఆది నుంచి వివాదస్పదులుగా పేరుపొందారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీ వీరికి పులివెందులలో పోస్టింగ్‌ ఇచ్చింది. అప్పటి నుంచి వీరి ఆరాచకాలకు అంతు లేకుండాపోయింది. అధికార పార్టీ అండదండలు చూసుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తూ రెచ్చిపోతున్నారు.

ఏసీబీ వలలో అవినీతి అధికారులు

పులివెందులలో అధికార పార్టీ అండ చూసుకుని డీఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అవినీతికి పాల్పడేవారు. వీరి కనుసన్నల్లో అధికార పార్టీ నాయకులు యథేచ్చగా జూదం, మట్కాలతోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆదాయంలో అధికార పార్టీ నాయకులు, పోలీసులు వాటాలు పంచుకునేవారు. ఈ నేపథ్యంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌, సీఐ వెంకటరమణల ఆదేశాలతో అనంతపురానికి చెందిన ట్రావెల్స్‌ యజమాని బ్రహ్మంను సింహాద్రిపురం ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ లంచం డిమాండ్‌ చేశారు. దొంగతనం చేసిన నిందితులను పోలీసులు పట్టుకోకుండా వారికి బైకు అమ్మారనే నెపంతో బ్రహ్మంతో రూ.7లక్షలు లంచం డిమాండ్‌ చేశారు.. అయితే ఇందులో రూ.2లక్షలకు ఒప్పందం కుదరగా.. గత సోమవారం లంచం డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌, సీఐ వెంకటరమణలను పట్టుకుని ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. అయితే ఇందులో ఎస్‌ఐ తన తప్పేమి లేదని, డీఎస్పీ, సీఐల ఆదేశాల మేరకే ఈ విధంగా చేయడం జరిగిందని ఏసీబీ అధికారుల ఎదుట మొరపెట్టుకున్నాడు. అయితే అతని ఆవేదన అరణ్య రోదనగా మారింది. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను మంగళవారం సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో లంచం విషయమై ఏసీబీ అధికారులు విచారించారు. అయితే లంచం కేసులో కేవలం ఎస్‌ఐ, సీఐలను నిందితులుగా చేర్చి రిమాండ్‌కు తరలించారు. ఇందులో సీఐ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా.. పెద్ద మొత్తంలో నగదు, బంగారంతోపాటు 59 మ ద్యం బాటిళ్లు కూడా లభ్యమయ్యాయి. మద్యం బాటిళ్లపై ఇప్పటికే సీఐ వెంకటరమణపై ఎకై ్సజ్‌ పోలీసులు ఎకై ్సజ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు కూడా నమోదు చేశారు.

పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌

పులివెందుల రూరల్‌ సీఐ వెంకటరమణ

కిశోర్‌పై థర్డ్‌ డిగ్రీ ప్రయోగం

టీడీపీ జెండాలు తొలగించారని అక్రమ కేసు నమోదు నేపథ్యంలో కిశోర్‌తోపాటు అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు వైఎస్సార్‌సీపీ నాయకులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. కౌన్సిలర్‌ కిశోర్‌తోపాటు మిగిలిన వారిని పలు పోలీస్‌స్టేషన్లు మార్చుతూ వారిపై తీవ్రంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ముఖ్యంగా కౌన్సిలర్‌ కిశోర్‌ను పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌, రూరల్‌ సీఐ వెంకటరమణలు కులం పేరుతో దూషిస్తూ థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. అయితే కిశోర్‌ అప్పట్లో కోర్టుకు హాజరుపెట్టేందుకు మేజిస్ట్రేట్‌ ఎదుట తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని వాపోయాడు. దీంతో మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు. అప్పట్లో డీఎస్పీ, సీఐలు అధికార పార్టీ రాజకీయ పలుకుబడితో విచారణను తప్పుదోవ పట్టించారు. దీంతో పార్నపల్లె కిశోర్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 1725/1/26/2025గా కేసు నమోదు చేసి వారిపై నాలుగు వారాల్లోగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. పార్నపల్లె కిశోర్‌ దళితుడు అయినందున పులివెందుల పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇప్పటికే అతనిపై మూడు 307 కేసులతోపాటు రౌడీ షీట్‌ కూడా ఓపెన్‌ చేశారు. గతంలో అరెస్టు చేసినప్పుడు పులివెందుల నుంచి వేముల పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని కిశోర్‌ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే పులివెందుల పోలీసులు కిశోర్‌ను వేముల పోలీస్‌స్టేషన్‌కు తరలించలేదని బుకాయించారు. అయితే తనతోపాటు మిగిలిన వారిని వేముల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సాక్ష్యాలను కిశోర్‌ మానవ హక్కుల కమిషన్‌కు అందజేశారు.

జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు

పులివెందుల డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోండి1
1/2

పులివెందుల డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోండి

పులివెందుల డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోండి2
2/2

పులివెందుల డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement