సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా కోటా వినుత భర్త కోట చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కోటా చంద్రబాబు తాజాగా వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చెన్నై పోలీసులకంటే ముందే సుధీర్ రెడ్డి.. మా రిమాండ్ రిపోర్టును ఎలా బయటపెట్టారు?. మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి ఎందుకు తమిళనాడు పోలీసులను కలిశారు?. మమ్మల్ని అనవసరంగా డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఇరికించారు. శ్రీకాళహస్తి నుంచి వన్ టౌన్ సీఐ గోపి చెన్నై సెవెన్ వెల్స్ పీఎస్‌లో మంతనాలు చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడించారు. మాపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాక ముందే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టారు. మా ఇష్యూపై మీడియాతో మాట్లాడారు.
మీరు అర్దం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చక ముందే చెన్నై పోలీసు కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్‌మీట్ పెడితే.. హత్య, ఆత్మహత్య అని తేల్చక ముందే మాపై నిందారోపణలు చేశారు. శ్రీకాళహస్తిలో హత్య జరిగి ఉంటే చెన్నై వరకు మృతదేహం తీసుకెళ్లడం సాధ్యమా?. ఈ హత్య కేసులో నిర్దోషులుగా బయటపడిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్ని వ్యాపారాలు చెన్నై కేంద్రంగా చేస్తూ మాపై కక్షసాధింపు చర్యలు చేశారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. కీలకంగా ఎదుగుతున్న తరుణంలో జనసేన పార్టీ నుంచి బహిష్కరించేలా చేశారు.
ఒక మహిళపై కుట్రలా?
తన రాజకీయ ప్రత్యర్ది ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే చేశారు. బలమైన రాజకీయ నాయకురాలిగా ఎదుగుతున్న వినుత కోటను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారు. రాజకీయ జీవితాన్ని సమాధి చేయడంలో భాగంగా ఈ హత్య కేసులో ఇరికించారు. 19 రోజుల్లో కోర్టులో ఈ కేసును నిరూపించలేకపోయారు. మేము ధైర్యంగా ఈ కేసులో నిర్దోషులం అని బయటపడతాం. హత్యకేసులో మాపై ఆరోపణలు నిరూపితం కాలేదు. డ్రైవర్ రాయుడు సెల్పీ వీడియోలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు, కోర్టుకు అన్ని విషయాలు అందించాం. ఒక మహిళపై కుట్రలు చేసి ఇరికించారు. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోలో కొన్ని విషయాలే బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి.
సుధీర్ రెడ్డి పాత్రే కీలకం..
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరిపించాలి. మేము రిమాండ్‌కు వెళ్లక ముందే మాపై మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడటం గుమ్మడికాయలు దొంగ అన్నట్లుగా ఉంది. అన్ని విషయాలు మేము బయటపెడతాం. ఈ కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ప్రజలు అందరికీ తెలుసు. మమ్మల్ని చంపాలని నువ్వు కుట్రలు చేశావు. శ్రీకాళహస్తి సీఐ గోపీని చెన్నై పంపించి మాపై కుట్ర చేయించావు. మహిళలు రాజకీయాలు ముందుకు రాకుండా ఇబ్బందులు పెట్టినా ఈరోజు నిలబడి ఉన్నాం. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది, సత్యమేవ జయతే’ అంటూ కామెంట్స్ చేశారు.


