
రాష్ట్ర బంద్ కారణంగా ప్రయాణికులు లేక వెలవెల బోతున్న హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్
బీసీ జేఏసీ పిలుపునకు రాష్ట్రమంతటా మద్దతు
బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న రాజకీయ పార్టీలు... మద్దతుగా ప్రజా సంఘాలు, కుల సంఘాలు
రోడ్డెక్కని బస్సులు...స్తంభించిన రవాణా వ్యవస్థ
ముందస్తుగా సెలవు ప్రకటించిన ప్రైవేటు విద్యా సంస్థలు
చాలాచోట్ల స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు
అన్ని పక్షాల మద్దతుతో ప్రశాంతంగా బంద్
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఈ బంద్‌లో పాల్గొనడంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడా హింసాత్మక ఘటనలు లేకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించగా... వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే బీసీ జేఏసీ నేతలు, పార్టీల నాయకులు బస్సు డిపోలు, బస్‌స్టాండ్‌ల ఎదుట బైఠాయించారు.
అన్ని జిల్లాల్లోనూ నాయకులు బంద్ విజయవంతానికి సహకరించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఎంజీబీఎస్, జేబీఎస్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని బస్‌డిపోల వద్ద నిరసన కార్యక్రమాలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగినప్పటికీ... బస్సులు లేకపోవడంతో విద్యార్థులు హాజరు కాలేదు. మరోవైపు జేఏసీ నేతలు వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి బంద్ పాటించాలని కోరుతూ వాటి కార్యకలాపాలను అడ్డుకున్నారు.
ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. జనాభా ప్రాతి పదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని నినదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని పక్షాల మద్దతుతో సంపూర్ణ బంద్ జరగడం ఇదే తొలిసారి. అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఈ బంద్‌లో పాల్గొనడం గమనార్హం.
⇒ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, వందలాది బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, బీసీ ఉద్యమ గీతాలతో ఆటపాటలు, ధూమ్‌ధామ్ నిర్వహించారు.
⇒ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామని పలువురు మంత్రులు నినదించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్‌తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్, సాట్స్ చైర్మన్ శివసేనరెడ్డి పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. కానీ, బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు మద్దతు అంటూ కేంద్రంలో మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు.
⇒ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన బంద్‌లో పాల్గొన్నారు.
⇒ మంత్రి కొండా సురేఖ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు బంద్‌లో పాల్గొన్నారు. ఆమె రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తొక్కిపెట్టిన బీజేపీకి ››బీసీల పాపం తగులుతుందన్నారు.
⇒ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌యాదవ్, ముఠాగోపాల్, గంగుల కమలాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బంద్‌లో పాల్గొన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి షెడ్యూల్ 9లో చేరిస్తేనే చట్టబద్దత వస్తుందని తెలిసీ కూడా జీవో తీసుకుని ఎన్నిలకు వెళ్లేలా నోటిఫికేషన్ ఇచ్చి, న్యాయస్థానాలు కొట్టేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు.
⇒ సికింద్రాబాద్‌లో నిర్వహించిన బీసీ బంద్‌లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు కమిషన్లు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. దిల్‌సుఖ్‌నగర్ డిపో వద్ద జరిగిన నిరసన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులు రోడ్డెక్కకుండా అడ్డుకునేందుకు బీసీ జేఏసీ నేతలు యత్నించగా పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన చర్యలతో తోపులాట చోటుచేసుకుంది.
⇒ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరన్వహించిన మానవహారంలో కల్వకుంట్ల కవితతోపాటు ఆమె కుమారుడు పాల్గొన్నారు.
⇒ బంద్‌కు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నారాయణగూడ నుంచి కోఠి వరకు జరిగిన ర్యాలీలో సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఎ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, న్యూ డెమోక్రసీ అధికారప్రతినిధి జేవీ చలపతిరావు, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ పి.సంధ్య, పీడీఎస్‌యూ నాయకులు మహేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
=ఎల్బీనగర్ చౌరస్తాలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, టి.చిరంజీవులు పాల్గొన్నారు.
ప్రయాణికుల పాట్లు...
రాష్ట్ర బంద్ నేపథ్యంలో బస్‌డిపోలు, బస్టాండ్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు జోరందుకోవడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీపావళి పండుగ పురస్కరించుకుని ఊళ్లకు వెళ్లేవారు, రోజువారీ జీవనోపాధి కోసం ప్రయాణించే వాళ్లు బస్సుల కోసం బస్టాండ్ల వద్ద పడిగాపులు కాశారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు రెట్టింపు డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. చాలాచోట్ల ఆటోలు, టాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనదారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4గంటల తర్వాత బస్సులు రోడ్డెక్కడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి.
బంద్ విజయవంతం: ఆర్.కృష్ణయ్య
హిమాయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, గ్రామాల్లో బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ విజయవంతమైందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్‌లో మీడియా సమావేశంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ విజీఆర్ నారగోని, కో–ఛైర్మన్ దాసు సురేశ్, కో–ఆర్డినేటర్ గుజ్జ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ ఉద్యోగులు, 135 కులసంఘాలు, ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
బీసీల ఆకాంక్షల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలన్నారు. 76 ఏళ్ల నుంచి బీసీలకు మోసం జరుగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం లాగా, సాగర హారం, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. చట్ట సభల్లో తమ రిజర్వేషన్లు సాధించే వరకు తెగించి పోరాడుతాం అని స్పష్టం చేశారు.